Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల(Rain Alert) కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది.
- V Santhosh Kumar
- Published on- September 4, 2026 / 05:55 PM IST
Meteorological Department announced heavy rains in Telugu states for next three days.
- తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- రైతులకు స్వల్ప ఊరట
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. తమిళనాడు తీరప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. దీనికి తోడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటంతో, రాబోయే రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Pawan Kalyan: పన్నుల ఎగవేత.. గోదావరి తీవ్ర కాలుష్యం.. ఆంధ్రా పేపర్ మిల్స్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం:
ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, వాయువ్య దిశగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణకోస్తా, రాయలసీమ పరిధిలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Rain Alert) లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలోనూ వర్షాలు.. రైతులకు లభించనున్న ఊరట:
దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజుతో పాటు శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. చాలా రోజులుగా వర్షాల కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలకు ఈ వానలు స్వల్ప ఊరటను ఇస్తాయని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో సంభవించిన ఈ హఠాత్తు మార్పులతో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది.
