Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. రానున్న రెండు రోజులు మోస్తరు వర్షాలు.. వాతావరణశాఖ కీలక సూచనలు
తెలంగాణ(Telangana Rains) వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- V Santhosh Kumar
- Published on- September 30, 2026 / 06:29 AM IST
Meteorological Department announced possibility of rain in Telangana for next two days.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏ ఏ జిల్లాలకు వర్ష సూచన? – ఎల్లో అలర్ట్ జారీ:
వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు అధికారుల నుంచి ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ అక్కడక్కడా జల్లులు పడే అవకాశముంది.
హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక సూచనలు:
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు, జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చెట్ల కింద, పాత భవనాలు మరియు విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని సూచించారు. ఉరుములు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు. అలాగే పొలాల్లో పనులు చేసుకునే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
