Hyderabad Rains : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో భారీ వర్ష సూచన.. పోలీస్ శాఖ కీలక సూచనలు..
Hyderabad Rains : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harish Thanniru
- Updated on- July 30, 2026 / 02:19 PM IST
Hyderabad Rains
Hyderabad Rains : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఇవాళ (గురువారం), రేపు (శుక్రవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న 24గంటల్లో అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చునని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లోనూ వర్షం దంచికొడుతుంది. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే, గురువారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. అయితే, మధ్యాహ్నం తరువాత, సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
గురువారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్ననేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టింది. వర్షం సమయంలో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలను కొంత సమయం వాయిదా వేసుకోవాలని సూచించారు.
వర్షాల కారణంగా రోడ్లపై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఐటీ కారిడార్ పరిధిలోని సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉన్నవాళ్లకు ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కంపెనీలకు తెలిపింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం ప్రభావంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని పోలీసులు కోరారు.
