Telangana Rains : తెలంగాణలో వానలు.. నాలుగు రోజులు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..

Telangana Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో సోమ, మంగళ, బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Telangana Rains

Telangana Rains : తెలంగాణలోని నాలుగు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read : Amit Shah-Rahul Gandhi : ప్రధాని కావాలంటే మాక్ పార్లమెంటులోనే ఉండాలి.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్లు!

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో సోమ, మంగళ, బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మురసు తుపాను మంగళశారం ఉదయం ఏపీలోని నెల్లూరు – నరసాపురం మధ్య తీవ్ర తుపానుగా మారి తీరందాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో మధ్య తెలంగాణ జిల్లాల వరకు ఈ తుపాను ప్రయణించి బలహీన పడుతుందని, ఈ కారణంగా గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇవాళ (సోమవారం) ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామలలో భారీవర్షాలు, ఇతర జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రేపు (మంగళవారం) ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు.

బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

భారీ వర్షాలు, భీకర గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గాలులు, వర్షాల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.