Telangana Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. మూడ్రోజులు వానలేవానలు..
Telangana Rain Alert : గత కొన్నిరోజులుగా మందకొడిగా సాగిన నైరుతి రుతుపవనాల్లో ప్రస్తుతం కదలిక వచ్చినట్లు, రానున్న 24గంటల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- Harish Thanniru
- Updated on- June 24, 2026 / 07:19 AM IST
Telangana Rain Alert
- తెలంగాణకు రెయిన్ అలర్ట్
- మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
Telangana Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిలకు జారీ చేసింది.
గత కొన్నిరోజులుగా మందకొడిగా సాగిన నైరుతి రుతుపవనాల్లో ప్రస్తుతం కదలిక వచ్చినట్లు, రానున్న 24గంటల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాస్తవానికి ఈనెల 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్యమార్పుల కారణంగా వాటి గమనం ఒక్కసారిగా మందగించింది. ఫలితంగా రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణ ఆలస్యమైంది.
తాజాగా.. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో రుతుపవనాలు పుంజుకున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
బుధవారం (24వ తేదీ) జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో.. గురువారం (25వ తేదీ) ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో.. శుక్రవారం (26వ తేదీ)న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఆయా రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు.. హైదరాబాద్‌లో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. దీంతో నగరవాసులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రానున్న 24గంటల్లో హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
