Telangana Rain Alert : రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే చాన్స్.. బయటకు రావొద్దు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ..

Telangana Rain Alert : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Telangana Rain Alert

  • తెలంగాణకు రెయిన్ అలర్ట్..
  • నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • హైదరాబాద్‌లోనూ దంచికొట్టనున్న వాన

Telangana Rain Alert : వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచి ఎండల తీవ్రత భారీగా పెరగడంతో మధ్యాహ్నం సమయాల్లో బయటకు రావాలంటేనే ప్రజలకు భయపడిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎండ వేడిమికితోడు ఉక్కపోత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, గత మూడు రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరో వారంరోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ఈ నెలాఖరు వరకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

Also Read : Rythu Bharosa : రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ‘రైతు భరోసా’ కొత్త అప్లికేషన్లు ప్రారంభం.. వెంటనే ఇలా చేయండి..

కర్ణాటక తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో 1.9 సెంటీమీటర్లు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, ఖమ్మం, నిర్మల్, సిద్దిపేట, హైదరాబాద్ తదితర జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి, వికారాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షం కురిసింది. అయితే, బుధ, గురు, శుక్ర, శనివారాల్లోనూ ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. అయితే, ఈ నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. బుధవారం హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

హైదరాబాద్ లోనూ బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అయితే, దక్షిణ హైదరాబాద్ ప్రాంతంపై భారీ ఉరుములతో కూడిన తుపాను మేఘాలు కమ్ముకున్నాయని అధికారులు హెచ్చరించారు. మహేశ్వరం, షాద్ నగర్ మీదుగా వస్తున్న భారీ తుపాను మేఘాలు నగరాన్ని ఇప్పటికే తాకాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో శంషాబాద్, రాజేంద్రనగర్, బహదూరుపురా, కార్వాన్, కాటేదాన్, బార్కాస్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో బయటకు రావొద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు.