Telangana Rains : తెలంగాణకు ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాల ముప్పు.. భీకర గాలులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Telangana rains : భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Telangana Rains

  • తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • అధికార యంత్రాంగానికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana Rains : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భీకర గాలులతో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read : Elon Musk Net Worth : ఎలాన్ మస్క్ సంపదతో ఏపీని 30ఏళ్లు, తెలంగాణను 33ఏళ్లు నడపొచ్చు.. భారతీయ రైల్వేను? ఆశ్చర్యకర లెక్కలు..

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల మీదుగా విస్తరించాయని, మరో రెండు రోజుల్లో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లోని మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ, రేపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావొద్దని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భీకర గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా రేపల్లిలో 7.3 సెంటీ మీటరర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాల కురవగా.. మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది. మరోవైపు.. కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది.