Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ..

Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Telangana Rains

Telangana Rains : తెలంగాణలో గత రెండుమూడు రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు ముఖం చాటేయడంతో ఎండిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Also Read : Driving Licence Alert : డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 వరకే చాన్స్..

ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్ష కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు పడే అవకాశం ఉండటంతో వర్షం పడేటప్పుడు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలుచోవద్దని, హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు.

మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సుందని అధికారులు తెలిపారు. ఇక 25వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.