Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- V Santhosh Kumar
- Published on- October 15, 2026 / 06:21 AM IST
Meteorological Department heavy rain alert in Andhra Pradesh and Telangana for next two days.
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rain Alert) పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చల్లటి గాలులు వీస్తున్నాయి. ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Ponnam Prabhakar: తగ్గుతున్న మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన!
తెలంగాణ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్:
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 72 గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, పరిసర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావం.. తీర ప్రాంతాలకు ముప్పు:
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
