Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!
తెలంగాణ (Telangana Rains)లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- V Santhosh Kumar
- Published on- September 1, 2026 / 06:24 AM IST
Meteorological Department indicated heavy rains in Telangana over next three days.
- తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక
Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ – హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు:
వర్ష తీవ్రత దృష్ట్యా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మోస్తరు నుండి చినుకులు(Telangana Rains) పడే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్ల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.
