High Temperature : నిప్పుల వర్షం.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఇవాళ, రేపు రెడ్ అలర్ట్.. బయటకు రావొద్దు.. వామ్మో.. ఇవేం ఎండలు సామీ..

High Temperature : తెలంగాణలో ఇవాళ (శుక్రవారం), రేపు (శనివారం) పలు ప్రాంతాల్లో వడ గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Meteorological Department

  • తెలంగాణలో భానుడి భగభగలు
  • రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
  • ఇవాళ, రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

High Temperature : భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. భానుడి సెగలకు రాష్ట్రం అగ్నిగుండమవుతుంది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలులు వీచాయి. 20 జిల్లాల్లో 46డిగ్రీలకుపైగా, మరో మూడు జిల్లాల్లో 45డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు కూడా ఆయా జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : TVK Vijay : డీఎంకే దెబ్బకు దిగొచ్చిన సీఎం విజయ్.. ఆ టెండర్ రద్దు.. ఇద్దరు అధికారులు సస్పెండ్.. ఆరు గంటల్లోనే టెండర్ ముగియడంపై పెద్ద రచ్చ..

భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు, వడగాల్పులు దాటికి గురువారం ఒక్కరోజు రాష్ట్రంలో 22 మంది మృత్యువాత పడ్డారు. వృద్ధులు, రోగులు, చిన్నారులు అధిక వేడికి అవస్థలు పడ్డారు. ప్రయాణికులు, ఆరుబయట పనిచేసే కార్మికులు ఎండపోటును తట్టుకోలేక విలవిల్లాడిపోయారు. రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు కూడా ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో ఇవాళ (శుక్రవారం), రేపు (శనివారం) పలు ప్రాంతాల్లో వడ గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

శుక్రవారం అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగాలులు నమోదుకానున్నాయి. అదేసమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శనివారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇండ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరమై బయటకు వచ్చినా ఎండదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.