Telangana Heavy Rains : బంగాళాఖాతంలో ఒక్కసారిగా భారీ మార్పు.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు అతిభారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..

Telangana Heavy Rains : తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Telangana Heavy Rains

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Telangana Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ప్రజలకు మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాల తీవ్రత ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Telangana Police Recruitment : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్!

గురువారం ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్ లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండి ముత్తడి దూకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. నివాసాలు కూలిపోయాయి. రహదారులపై నీరు ప్రహించడం, చెట్లు పడిపోవడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

రాష్ట్రంలో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.