Ponguleti Srinivas Reddy: తెలంగాణలో పెరుగనున్న భూముల ధరల.. స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి
తెలంగాణలో 50 నుంచి 100 శాతం వరకు భూముల ధరలు పెరుగనున్నట్టు ప్రకటించిన మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy).
- V Santhosh Kumar
- Published on- June 4, 2026 / 08:34 PM IST
Minister Ponguleti Srinivas Reddy announced that land prices in Telangana would rise.
- తెలంగాణలో రేపటి నుంచే భూముల ధరలు
- యాభై నుండి వంద శాతం పెంపు
- మార్కెట్ విలువలపై మంత్రి పొంగులేటి ప్రకటన
Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుండి భారీగా పెరగనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. గురువారం హైదరాబాద్ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వివరాలను ప్రకటించారు. ప్రాంతాల డిమాండ్‌ను బట్టి భూముల ధరలు 50 నుండి 100 శాతం వరకు పెరుగుతాయని, ముఖ్యంగా ప్రైమ్ ఏరియాల్లో ఈ పెంపు వంద శాతంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ భూముల విలువల సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ.1200 కోట్ల నుండి రూ.1400 కోట్ల వరకు రాబడి రానుందని అంచనా వేశారు. అయితే శేరిలింగంపల్లి, రాజేందర్ నగర్, ఖాజాగూడ వంటి ఇప్పటికే గరిష్ట ధరలు ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల ఉండదని మంత్రి మినహాయింపునిచ్చారు.
Dmk Party: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. ఢిల్లీ సమావేశం బహిష్కరణ
వ్యవస్థలో పారదర్శకత కోసం సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు (ఫుల్ పవర్స్) కోత పెట్టి, కేవలం కనీస అధికారాలు మాత్రమే ఉంచినట్లు మంత్రి తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభుత్వానికి కొంత భారం పడినా, రైతులకు మాత్రం కచ్చితంగా మేలు జరుగుతుందని, ఇన్నర్ సైడ్ ఎకరం కనీసం రూ.15 లక్షలు పలుకుతోందని వివరించారు. ఎక్కడైనా తక్కువ ధరల నిర్ధారణలో పొరపాట్లు దొర్లితే సరిదిద్దడానికి ప్రత్యేక ‘హెల్ప్ డెస్క్’ ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని అంతమొందించేందుకే ఏసీబీ దాడులు పెరిగాయని, గత ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా మూలనపడ్డ వేల ఫైళ్లను తాము అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వేగంగా పరిష్కరించామని స్పష్టం చేశారు. అలాగే ఫ్యూచర్ సిటీ రద్దు చేసే ప్రసక్తే లేదని, త్వరలోనే తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిన్నర కాలంలో 90 శాతం గ్రామాల భూ సర్వే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన అసైన్డ్ భూములను గుర్తించి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితాలో (ప్రొహిబిటెడ్ లిస్ట్) చేర్చిందని, త్వరలోనే వీటికి సంబంధించి ఒక స్పష్టమైన పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు విడుదల చేశామని, పాడి సేకరణ కూడా 90 శాతం పూర్తయిందని తెలిపారు. ప్రజలకు మరియు ప్రభుత్వానికి మంచి జరిగే ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి తాను అస్సలు వెనకాడనని మంత్రి పొంగులేటి కుండబద్దలు కొట్టారు.
