Ponguleti Srinivas Reddy: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ అయిన విపత్తుల శాఖ.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు!
విపత్తుల నిర్వహణ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు నిరోధక చర్యలు చేపట్టాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)అధికారులను ఆదేశించారు.
- V Santhosh Kumar
- Published on- June 16, 2026 / 08:55 AM IST
Minister ponguleti srinivas reddy reviews rain preparedness
- ఈ నెల 19 నుండి భారీ వర్షాలు.
- తెలంగాణ అంతటా రుతుపవనాల వేగవంతమైన విస్తరణ.
- అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి.
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు నిరోధక చర్యలు చేపట్టాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, ముందే తీవ్రతను అంచనా వేసి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సోమవారం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పేర్కొన్నారు.
RBI New Rules: ఇక బ్యాంకింగ్ మోసాలకు చెక్.. కస్టమర్లకు భారీ ఊరట.. ఆర్బీఐ కఠిన నిబంధనలు
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నాయని, ఇప్పటికే దక్షిణ, మధ్య తెలంగాణలోని మెజార్టీ జిల్లాలను ఇవి తాకాయని మంత్రి (Ponguleti Srinivas Reddy)వివరించారు. ఈ నెల 8న జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా ప్రవేశించిన రుతుపవనాలు, ప్రస్తుతం హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ఉత్తర సరిహద్దుల వైపు సాగుతున్నాయి. అయితే, జూన్ 1 నుంచి 15 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 65 నుండి 70 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 50 నుండి 55 మి.మీ మాత్రమే నమోదైంది. సాధారణం కంటే 30 శాతం లోటు ఉన్నప్పటికీ, రాబోయే నాలుగు రోజుల్లో ఈ కొరత తీరి తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వాతావరణ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ముఖ్యంగా 18వ తేదీ తర్వాత నైరుతి రుతుపవనాల ప్రభావం మరింత పెరగనుంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ నగర విషయానికి వస్తే, వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసి, 18వ తేదీ తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, లోతట్టు మరియు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
