Ponguleti Srinivas Reddy: ఎల్‌నినోతో తెలంగాణలో కరువు ముప్పు.. రైతులు రెండో పంట వేయవద్దు.. విద్యుత్, నీటి కొరతపై ప్రభుత్వం అలర్ట్!
కరవు ముప్పుతో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఆందోళన వ్యక్తం చేశారు.
- V Santhosh Kumar
- Published on- October 12, 2026 / 10:09 AM IST
Minister Ponguleti warned of looming drought threat due to El Nino
Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలో రాబోయే కాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవు ముప్పుతో పాటు తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గ్లోబల్ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతున్న ‘ఎల్‌నినో’ కారణంగా సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం పొలాల్లో ఉన్న మొదటి పంటను ప్రభుత్వం వంద శాతం కష్టపడి కాపాడుతుందని, కానీ రైతులు ఎవరూ దయచేసి రెండో పంట వేయవద్దని అధికారికంగా విజ్ఞప్తి చేశారు.
యూనిట్‌కు రూ.15 పెట్టినా దొరకని విద్యుత్.. పొదుపు చేయాలని పిలుపు:
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎదురయ్యే విద్యుత్ కొరతపై స్పందించిన మంత్రి, పవర్ గ్రిడ్‌లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడం సంక్లిష్టంగా మారనుందని తెలిపారు. బయటి మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ. 15 వెచ్చించినా విద్యుత్ కొనుగోలు చేయలేని దయనీయ పరిస్థితులు ఉన్నాయని, కావున ప్రజలందరూ విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రైతులు రెండో పంట వేస్తే నీరు, విద్యుత్ అందక పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోతారని, ఆ దెబ్బతో ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
త్యరలోనే కేబినెట్ భేటీ, అఖిలపక్ష సమావేశం.. కేంద్రం అండగా నిలవాలని డిమాండ్:
వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి, విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుందని పొంగులేటి వెల్లడించారు. తెలంగాణకు సంక్షోభ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దన్నలా అండగా నిలవాలని కేబినెట్ వేదికగా తీర్మానించి ప్యాకేజీ విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే, ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడానికి రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలతో త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
