Miyazaki Mango Price : ఈ మామిడి పండ్లు కేజీ రూ.3 లక్షలు.. మన రంగారెడ్డి జిల్లాలోనే

Miyazaki Mango: రంగారెడ్డి జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి సాగు అవుతోంది.

miyazaki mango price rs 3 lakh per kilogram now available in ranga reddy district

Miyazaki Mango Price Ranga Reddy : వేసవి కాలం అనగానే మండే ఎండలు, సెలవులతో పాటు గుర్తుకు వచ్చేది ఏంటంటే మామిడి పండ్లు. కేవలం వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లను జుర్రుకుని, ఆస్వాదించి.. పచ్చి వాటితో పచ్చళ్లు పెట్టుకుని ఏడాదికి సరిపడా మామిడి రుచిని ఆస్వాదిస్తారు. ఇక వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. మన దేశం నుంచి విదేశాలకు కూడా మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంటారు. సాధారణంగా మామిడి పండ్లు రకాలు, రుచి, నాణ్యతను బట్టి కిలో రూ. 70 నుంచి రూ. 300 వరకు ధర పలుకుతాయి. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే మామిడి పండ్ల ధర కేజీ రూ. 2.70 లక్షలు. మరి ఇన్ని లక్షల ధర పలికేంత ప్రత్యేకత ఆ మామిడిలో ఏముంది అంటే…

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో

ఇది సాధారణ మామిడి కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజకి’ రకం. అందుకే దీనికి అంత ధర. బహిరంగ మార్కెట్‌లో ఈ మియాజకి మామిడి కిలో ధర సుమారు రూ. 2.70 లక్షలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అరుదైన రకం పండ్లు రంగారెడ్డి జిల్లాలో కూడా సాగవుతున్నాయి. హైదరాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని మతీన్‌ ముజదదికి చెందిన ఫామ్‌హౌస్‌లో ప్రపంచంలోనే ఖరీదైన మియాజకి మామిడి కాయలు మొట్టమొదటిసారిగా కాశాయి.

పదేళ్ల క్రితం నాటితే ఇప్పుడు కాపు

ఈ సందర్భంగా ఈ మామిడి పండ్ల యజమాని (ఓనర్) మతీన్ మాట్లాడుతూ.. “మియాజకి చాలా అరుదైన రకం మామిడి. పదేళ్ల క్రితం మా సోదరుడు ఈ మియాజకి మామిడి మొక్కను నాకు బహుమతిగా ఇచ్చారు.. ఇప్పుడది ఖరీదైన పళ్లను ఇచ్చింది” అని చెప్పుకొచ్చారు.

దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా దొరకని ఈ రకం మామిడి పండు తన ఫామ్‌హౌస్‌లో ఉండటం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణంపై ప్రేమతో, చెట్లపై మమకారంతో తన ఫామ్‌హౌస్‌లో అరుదైన రకాల మొక్కలు పెంచుతున్నట్లు మతీన్ చెప్పారు. దానికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా అందుకున్నట్లు ఆయన వివరించారు.