MLA Sudheer Reddy : MLA వినూత్న నిరసన.. దోమ తెర గౌన్ తో అసెంబ్లీకి.. ‘దోమలకి భయపడే ఎవరూ హైదరాబాద్ రావడం లేదు’

MLA Sudheer Reddy : నగర వాసులను ఇబ్బంది పెడుతున్న దోమల సమస్యపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలియజేయశారు.

mla sudheer reddy variety protest on mosquito problem in hyderabad wear Mosquito Net gown

  • నగరవాసులను ఇబ్బంది పెడుతున్న దోమలు
  • దోమల సమస్యపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన
  • దోమ తెర గౌన్ తో మీడియా సమావేశం

MLA Sudheer Reddy : ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే దోమల బెడద ఉండేది. కానీ ఇప్పుడు సీజన్‌తో పని లేకుండా ఏడాదంతా దోమలు దండయాత్ర చేస్తూనే ఉన్నాయి. ఊళ్లలో పరిస్థితి కాస్త నయమేమో కానీ హైదరాబాద్‌లో మాత్రం దోమల బెడద బాగా ఉంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా గుయ్‌మని మోత మోగిస్తూనే ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు గడపలో కాచుకుని ఉంటున్నాయి. డోర్ తీయడమే ఆలస్యం ఇళ్లలోకి దండయాత్ర చేస్తున్నాయి. దోమకాటు వల్ల నగరంలో డెంగ్యూ, మలేరియా వంటి అనారోగ్య సమస్యలు తీవ్రం అవుతున్నాయి. ఈ క్రమంలో దోమల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఎమ్మెల్యే వినూత్న ఆలోచన చేశారు. దోమతెరతో కుట్టించిన గౌను ధరించి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు.

నగరవాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న దోమల సమస్యపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో దోమతెరతో కుట్టించిన గౌను ధరించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయి. దోమలతో భాగ్యనగరం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా బీఆర్ఎస్ హయాంలో నాలుగు, ఐదు సార్లు దోమల బెడద లేకుండా చర్యలు తీసుకునే వాళ్లం’’ అని తెలిపారు.

‘‘దోమలపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా నగరవాసులు.. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. దోమలను అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అని ప్రజలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే కొన్ని నిబంధనలు ఉంటాయి. దోమల బెడదపై అసెంబ్లీ మీడియా హాల్లో దోమతెరతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మార్షల్స్ అడ్డుకున్నారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం చేశారు’’ అని మండిపడ్డారు.

‘‘దోమల బెడదకు భయపడి ఎవరూ హైదరాబాద్ రావడం లేదు. నగరంలో దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మార్షల్స్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి డివిజన్‌కు 10 ఫాగింగ్ మిషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారు? హైదరాబాద్ ప్రజలు దోమతెర కుట్టించుకునే పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. కరోనా వచ్చినప్పుడు మాస్క్ ఎలా పెట్టుకున్నామో, హైదరాబాద్‌లో దోమల బెడద తట్టుకోలేక దోమతెర కుట్టించుకునే పరిస్థితి వచ్చింది’’ అంటూ సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు.