Moinabad Farm House Case: పోలీసులను గాయపరిచి పారిపోవాలని ప్లాన్..! మొయినాబాద్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కు డ్రగ్ పాజిటివ్ వచ్చిందన్నారు. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలో బయటపడిందన్నారు.
- Naveen
- Published On : March 16, 2026 / 06:28 PM IST
Representative Image (Image Credit To Original Source)
- ఉద్దేశపూర్వకంగా పోలీసులపై కాల్పులు జరిపారు
- పోలీసులను తీవ్రంగా గాయపరిచి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకోవాలని చూశారు
- రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుట్టా మహేశ్ కు డ్రగ్ పాజిటివ్
- మందులో కొకైన్ కలుపుకుని తాగారు
Moinabad Farm House Case: ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఫామ్ హౌస్ లోకి వెళ్లగానే మొదట బుల్లెట్ సౌండ్ వినపడిందని, వెంటనే తాము అప్రమత్తం అయ్యామని చెప్పారు. తాము పోలీసులమని, కాల్చవద్దని, తాము ఎలాంటి చర్యలు తీసుకోము అని గట్టిగా అరిచినట్లు వెల్లడించారు. తాము చెబుతున్నప్పటికి కూడా మరో రెండుసార్లు బుల్లెట్ సౌండ్ వినిపించిందన్నారు పోలీసులు. మరోవైపు మీరు కాల్పులు జరపండి, అంతా తాను చూసుకుంటానని, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినిపడిందని పోలీసులు చెప్పారు. తామంతా గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయిందన్నారు పోలీసులు.
ఫామ్ హౌస్ సెర్చ్ చేసేందుకు అప్పటికే తాము వారెంట్ తీసుకున్నామని, దానిని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాత్ రూమ్ దగ్గరున్న నమిత్ శర్మ చేతిలో ఉన్న తుపాకీని తాము స్వాధీనం చేసుకున్నామని, బుల్లెట్ షెల్స్ పట్టుకుని మరొకరు ఉన్నారని, అతడిని కూడా తాము అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32ని స్వాధీనం చేసుకుని, 11 మందిని విడివిడిగా విచారించినట్లు చెప్పారు.
ఎవరూ కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారని, అందరినీ పదే పదే విచారించడంతో చివరికి సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. సిల్వర్ శరత్ కుమార్ ను చెక్ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడిందని, అది ఎక్కడిదని, ఎవరు తెచ్చారని ప్రశ్నిస్తే ముందుగా ఎవరూ చెప్పలేదన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారు అనే విషయం బయటపడిందన్నారు.
డ్రగ్స్ కోసం కొంత డబ్బును కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ తెలిపాడని, కొకైన్ తానే తెచ్చానని కౌశిక్ ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్లినప్పుడు కొకైన్ తీసుకుని వచ్చానని కౌశిక్ చెప్పాడని పోలీసులు తెలిపారు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డ్రగ్ కొన్నట్లు, ఈ పార్టీ కోసమే కొకైన్ తీసుకొచ్చినట్లు కౌశిక్ చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో గ్రాముకు 15వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పాడని పోలీసులు తెలిపారు.
పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని చూశారు..
11మందికి డ్రగ్ లైవ్ కిట్ల ద్వారా టెస్టులు చేశామని.. అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నమిత్ శర్మను అరెస్ట్ చేశామన్నారు. రితేశ్ రెడ్డి దగ్గర ఉండాల్సిన లైసెన్స్ రివాల్వర్ నమిత్ శర్మ దగ్గరకు వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకుని పారిపోవాలని ప్లాన్ చేశారని, కాల్పులతో పోలీసులను తీవ్రంగా గాయపరచాలని అనుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
సెకండ్ ఒపీనియన్ కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ రక్త నమూనా పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కు డ్రగ్ పాజిటివ్ వచ్చిందన్నారు. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలో బయటపడిందన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డి కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్టులో వెల్లడైందన్నారు.
పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానంతోనే పార్టీకి వచ్చారు..
పార్టీ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. లిక్కర్ లో కొకైన్ కలుపుకుని తాగారని చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానంతోనే నిందితులంతా పార్టీకి వచ్చారని రిమాండ్ రిపోర్టులో పోలీసుల పేర్కొన్నారు.
