Raghunandan Rao: హైకోర్టు సీజేకు ఎంపీ రఘునందన్ సంచలన లేఖ.. రేవంత్, కేటీఆర్ ఆస్తులపై విచారణకు డిమాండ్!
తెలంగాణ కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతల ఆస్తుల పంచాయతీపై ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు అధికారికంగా లేఖ రాశారు.
MP Raghunandan Rao wrote letter to High Court Chief Justice seeking an inquiry on Chief Minister and BRS leaders.
Raghunandan Rao: తెలంగాణ రాజకీయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న తీవ్ర ఆరోపణలు, ఆస్తుల పంచాయతీపై మెదక్ ఎంపీ రఘునందన్(Raghunandan Rao) రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఆయన అధికారికంగా లేఖ రాశారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, ఇరు పక్షాలు చేసుకున్న తీవ్ర ఆరోపణల వివరాలను ఈ లేఖకు జతచేశారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు హైకోర్టు తెరిచే సమయానికే తన రాతపూర్వక ఫిర్యాదును సమర్పించానని, దీనిని పిల్ గా లేదా నేరుగా విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అక్టోబర్ 2న చెప్పిన విధంగానే ఈ విచారణ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
సీఎం, కేసీఆర్ కుటుంబాల ఆస్తులపై న్యాయ విచారణకు విజ్ఞప్తి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒకరిపై ఒకరు చేసుకున్న తీవ్ర ఆరోపణలకు సంబంధించిన పత్రాలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి లేఖకు జతపరిచినట్లు రఘునందన్ తెలిపారు. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని చెప్తున్న రూ.లక్ష కోట్లు, అలాగే రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి సంపాదించారన్న రూ.50 వేల కోట్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఇరు నాయకులు తమ ఎన్నికల అఫిడవిట్లలో చూపించిన ఆస్తుల కంటే అదనంగా ఉన్న ఆస్తులను వెంటనే గుర్తించి, ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కూ లేఖ పంపుతానని వెల్లడి:
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించి మెడికవర్ ఆసుపత్రి, స్కూళ్లు, ఇతర వ్యాపార భాగస్వామ్యాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా తపాాలా ద్వారా ఫిర్యాదు ప్రతులను పంపనున్నట్లు వెల్లడించారు. ఇరు కుటుంబాలు అక్రమంగా ఆర్జించిన ప్రజాధనాన్ని తిరిగి ప్రజలకే పంచాలని, వాస్తవాలను సుప్రీంకోర్టు, హైకోర్టుల పర్యవేక్షణలో బయటకు తీయాలని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు.
