BRS Party : ఉత్కంఠకు తెర.. ఆ రెండు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి..

BRS Party : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

Kaytanapalle and Ibrahimpatnam Municipality

BRS Party : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా పరిధిలోని క్యాతనపల్లి, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా.. ఉత్కంఠతకు తెరదించుతూ శనివారం ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.

Also Read : Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించాలి..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. భారీ బందోబస్తు, ఆందోళనల మధ్య ఎన్నిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. బీఆర్ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ఆకుల యాదగిరి పేర్లు ప్రతిపాదించబడ్డాయి. సభ్యులు చేతులు ఎత్తే విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించాురు. ఇందులో మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నిక ప్రక్రియకు ముందు కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి.. తీర్పు వచ్చే వరకు ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఎన్నికల అధికారులు తేల్చిచెప్పారు.

మరోవైపు.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్నికూడా బీఆర్ఎస్ కౌవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్‌పర్సన్ పదవిని సీపీఐ అభ్యర్థి సరిత దక్కించుకున్నారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, సీపీఐ పొత్తు పెట్టుకోగా, 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్‌-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. గతంలో చైర్మన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడగా.. కోర్టు ఆదేశాలతో శనివారం ఎన్నికల అధికారులు ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు.

మరోవైపు ఖానాపూర్ చైర్‌పర్సన్ ఎన్నిక సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.