Nandamuri Balakrishna House: నందమూరి బాలకృష్ణ బిగ్ డిసిషన్.. రోడ్డు విస్తరణకు సెంటిమెంట్ నివాసం త్యాగం

కేబీఆర్‌ పార్క్‌ భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం బాలకృష్ణ(Nandamuri Balakrishna House) తన ఇంటిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

Nandamuri Balakrishna handed over his residence to government for the KBR Park elevated corridor

Nandamuri Balakrishna House: హైదరాబాద్‌ నగరం కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు నిర్మించతలపెట్టిన రూ.1,090 కోట్ల ‘హెచ్‌సిటీ’ ప్రాజెక్ట్‌ రద్దు కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా అధికారులు భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ను తెరపైకి తెచ్చారు. నాగార్జున సర్కిల్‌ ఎగువ ప్రాంతం నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు సుమారు 4.3 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, కీలక జంక్షన్ల అభివృద్ధి కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయగా, దీనికి సంబంధించిన ప్రణాళికలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

Read Also – Ponguleti Srinivas Reddy: ఎల్‌నినోతో తెలంగాణలో కరువు ముప్పు.. రైతులు రెండో పంట వేయవద్దు.. విద్యుత్, నీటి కొరతపై ప్రభుత్వం అలర్ట్!

బాలకృష్ణ నివాసం సహా ప్రముఖ స్థలాల సేకరణ.. కూడళ్ల విస్తరణకు మార్గం సుగమం:

ఈ కీలక కారిడార్‌ పరిధిలోని కూడళ్ల విస్తరణకు అవసరమైన భూసేకరణకు సినీ నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, శబ్దాలయ స్టూడియో అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి, భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బంజారాహిల్స్‌ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే రోడ్డు నంబరు 45 జంక్షన్ అభివృద్ధికి బాలకృష్ణ నివాసంలోని 862.77 చదరపు గజాల స్థలాన్ని సేకరించనున్నారు. ఎన్టీఆర్ అభిమానులను కలిసిన సెంటిమెంట్ ఇల్లు అయినప్పటికీ, ప్రాజెక్టు కోసం స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకరించి నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చనున్నట్లు సమాచారం.

శబ్దాలయ స్టూడియో, ఫిల్మ్‌నగర్ జంక్షన్లలో భూసేకరణ.. తగ్గునున్న ట్రాఫిక్ కష్టాలు:

మరోవైపు శబ్దాలయ స్టూడియో, ప్రసాద్ ల్యాబ్స్, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు మార్గంలోని జంక్షన్ అభివృద్ధి కోసం శబ్దాలయ స్టూడియోకి చెందిన రూ.30.40 కోట్ల విలువైన 608 గజాల స్థలాన్ని సేకరించేందుకు యాజమాన్యం టీడీఆర్‌కు అంగీకరించింది. అలాగే ఫిల్మ్‌నగర్‌ జంక్షన్ విస్తరణకు భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని ఆనంద్‌ప్రసాద్‌ తన 341.33 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంతో కీలక జంక్షన్ల అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో నగరంలో ప్రధాన ఐటీ కారిడార్‌ వైపు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది.