Patlolla Rupa Reddy Arrested : పటోళ్ల రూపారెడ్డి అరెస్టు.. కొన్ని రోజులుగా ఆమె ఇంట్లోనే ఎమ్మెల్యే కుమారుడు..!
Patlolla Rupa Reddy Arrested : నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పటోళ్ల రూపారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
- Harish Thanniru
- Updated on- August 7, 2026 / 01:07 PM IST
Narsingi Police Arrested Patlolla Rupa Reddy
Patlolla Rupa Reddy Arrested : చిట్టీల పేరుతో పలువురిని మోసం చేశారని పటోళ్ల రూపారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై చీటింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితురాలు ఇదే తరహాలో పలువురిని మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు తేలింది. దీంతో ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
మరోవైపు.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్‌తో పటోళ్ల రూపారెడ్డి కుమార్తెకు ఇటీవల నిశ్చితార్ధం జరిగింది. జులై 8న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే, సంతోష్ గౌడ్ పటోళ్ల రూపారెడ్డి కుమార్తెను పెండ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుటుంబానికి ఇష్టం లేదు. సంతోష్ గౌడ్ పటోళ్ల రూపారెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిశ్చితార్ధం చేసుకున్నాడు. గత నెల రోజులుగా అతను రూపారెడ్డి ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రూపారెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఏక్షణమైనా తనను చంపేస్తారని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ చెప్పిన ఆయన.. బుధవారం 40మంది వ్యక్తులు వచ్చి నేను ఉంటున్న ఇంటిపై దాడి చేశారని తెలిపారు. నా ప్రేమ వ్యవహారం కారణంగానే ఇదంతా జరుగుతోంది. ముందు నుంచి మా ప్రాణాలకు ముప్పు ఉంది. మేము ముగ్గురం చనిపోతే వాళ్లదే బాధ్యత. వారి కాల్ డేటా వివరాలు మీడియాకు ఇస్తానని సంతోష్ గౌడ్ తెలిపారు. తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. ఎవరో అప్పులివ్వాలని అందరితో పిటిషన్లను ఇచ్చి ఇంటి ఆడవాళ్ల మీద దాడి చేయించడం ఎంతవరకు కరెక్ట్ సంతోష్ గౌడ్ ప్రశ్నించాడు. సంతోష్ గౌడ్ తన తండ్రి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పై సంచలన ఆరోపణలు చేయడం, ఇదే సమయంలో పటోళ్ల రూపారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.
