Telangana Meeseva : తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్.. కొత్త రూల్స్ ఇవే..
Telangana Meeseva : ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. మీసేవా కేంద్రంలో ఏదైనా సర్టిఫికెట్ లేదా సేవ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇకనుంచి మీకు చేతికి కాగితపు రశీదు ఇవ్వరు.
- Harish Thanniru
- Updated on- June 18, 2026 / 07:45 PM IST
MeeSeva centers New rules
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో కొత్త రూల్స్
- ఇక నుంచి రశీదు విధానంకు స్వస్తి
- నేరుగా మీ రిజిస్టర్ మొబైల్‌కే దరఖాస్తు వివరాలు
Telangana Meeseva : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మీ సేవా కేంద్రాల్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణతో పాటు డిజిటలైజేషన్‌ను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో జూన్ 19 నుంచి మీ సేవా కేంద్రాల్లో కాగితపు రశీదులు విధానానికి స్వస్తి పలికి, కేవలం ఎస్ఎంఎస్ ల ద్వారా మాత్రమే రశీదులు ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. మీసేవా కేంద్రంలో ఏదైనా సర్టిఫికెట్ లేదా సేవ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు చేతికి కాగితపు రశీదు ఇవ్వరు.. ఇకనుంచి మీరు రిజిస్టర్ సమయంలో ఇచ్చిన యాక్టివ్ మొబైల్ నెంబర్ కు నేరుగా ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ డిజిటల్ రిసీప్ట్ లోనే మీరు అప్లయ్ చేసిన సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలు, ట్రాన్సాక్షన్ వివరాలు, అత్యంత ముఖ్యమైన అప్లికేషన్ నంబర్ వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. అయితే, అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న సరైన ఫఓన్ నెంబర్ ను మాత్రమే ఇవ్వాలి. లేదంటే రిసీప్ట్ రాకపోవటంతోపాటు.. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవటం కష్టమవుతుంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా రశీదులను చాలా సులభంగా వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌లోనే నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే భవిష్యత్తు వినియోగంకోసం ఆ లింక్ ద్వారా ఎక్కడి నుండైనా ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారుడికి ప్రభుత్వం నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ జారీ కాకముందే వారి మొబైల్ ఫోన్ నుంచి ఆ ఎస్ఎంఎస్ పొరపాటున డిలీట్ అయితే కంగారు పడాల్సిన పనిలేదు. మీ సేవా కేంద్రాల్లో రిసెండ్ ఆప్షన్ ద్వారా మళ్లీ అదే రశీదును సంబంధిత దరఖాస్తుదారుడి మొబైల్ కు పంపేలా ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.
