Padma Awards 2026: తెలుగు పద్మాలు.. పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగువారు వీరే..

అవార్డ్ గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.

  • Updated on- May 26, 2026 / 12:39 AM IST

Padma Awards 2026: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను ప్రదానం చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులు దక్కాయి. వారిలో ఐదుగురు పద్మ విభూషణ్, 13 మంది పద్మ భూషణ్, 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు. మొదటి విడతలో 66 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

తెలుగు వాళ్లు దీపికారెడ్డి, వెంపటి కుటుంబశాస్త్రి, గూడూరు వెంకటరావు, పాలకొండ విజయ్ ఆనందరెడ్డి అవార్డులు స్వీకరించారు. గతేడాది కన్నుమూసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ధర్మేంద్ర బదులు భార్య హేమ మాలిని పురస్కారం అందుకున్నారు.

తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ వైద్యుడు వెంకట్రావు, క్యాన్సర్ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి పద్మ పురస్కారం అందుకున్నారు. అవార్డ్ గ్రహీతలను రాష్ట్రపతి అభినందించారు. దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

2026 సంవత్సరానికి కేంద్రం 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. తొలి విడతలో 66 మందికి రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేశారు. ఇవాళ్టి వేడుకలో 2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మ శ్రీ అవార్డులను ప్రదానం చేశారు.