BRS: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టుకు బీఆర్ఎస్.. రేపే విచారణ

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Published On : March 24, 2026 / 07:31 PM IST

BRS: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. వారిపై అనర్హత వేటు పడే వరకు పోరాటం ఆపేది లేదంటోంది. తాజాగా ఈ అంశంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 9 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన వారిలో గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుని తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ సంకేతం ఇచ్చారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కోసం మరొకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది.

పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ఇచ్చారు. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తన తీర్పును ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

కాగా, ఈ వ్యవహారంలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. స్పీకర్ తీర్పును కొట్టివేయాలంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు.. నోటీసులు జారీ చేసింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని హైకోర్టును కోరారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన దానం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ క్రమంలో దానం నాగేందర్ వ్యవహారంలో స్పీకర్‌ తీర్పు సరైంది కాదని దాన్ని కొట్టేయాలని ఆయన వాదిస్తున్నారు.

గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. అయితే, విచారణ జరిపిన స్పీకర్ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. వారంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని నిరూపించడానిక సరైన ఆధారాలు లేవన్నారు. వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని కూడా స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని, తన హక్కులను స్పీకర్ దుర్వినియోగం చేశారని ఆరోపించింది.

Also Read: వారందరికీ శుభవార్త… తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే..