Pawan Kalyan – Alliances : తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం వ్యతిరేకించాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామనా..?
Pawan Kalyan – Alliances : హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీ, పొత్తులపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 2028 ఎన్నికల్లో తెలంగాణ జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పొత్తు.. టీడీపీతోనా, బీజేపీతోనా అనేది వాళ్లే చెప్పాలన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారని.. నేను కూడా మా పార్టీ నేతలకు ఒంటరిగానే పోటీ చేయమని సలహా ఇస్తానని చెప్పారు.
”ఇంకా ఎంత కాలం ఈ బెదిరింపులు? మీరు భయపెట్టే కొద్దీ ఈ గుండె గట్టిపడుతుంది తప్ప భయపడదు. ఇంకెంత కాలం ఈ ప్రాంతీయ విబేధాలు. తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏరోజూ కూడా జనసేన అగౌరవపరచలేదు. గుండెల్లో పెట్టుకుంది. ప్రాంతీయతను గౌరవిస్తాం. కానీ, అదే ప్రాంతీయత పేరుతో జాతీయ వాదాలను బలహీన పరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు.
2008, 2009లో తెలంగాణ అంతా తిరిగాను. మీరు రమ్మంటే నేను ఎందుకు రాను. నాకు భయాలు లేవు. గొడవలు పెట్టేందుకు రాను. సమస్యలపై పోరాడేందుకు అయితే వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఆంధ్రోళ్లు, తెలంగాణ వాళ్లు అని వేరు చేసి మాట్లాడితే అది చాలా ప్రమాదకరం. తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం వ్యతిరేకించాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామనా..?
పార్టీ పెట్టాము అంటే చనిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. తిరిగి గడీల పాలన తెస్తారా? దొరల పాలన తెస్తారా? నాలాంటి వాడినే భయపెడితే, నాలాంటి వాడి తోటలోకే వస్తే.. ప్రతి ఒక్కరి ఇంట్లోకి దూరతారు.. అందుకే ఆపుతున్నా.. నా మీద దాడి చేస్తే భయాలు లేవు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించిన తీరునే నేను తప్పుపట్టాను. తెలంగాణ వచ్చినందుకు నేను ఎప్పుడూ బాధ పడలేదు. ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా? ప్రజలను చైతన్యవంతులం చేస్తామని అంతా భయపడుతున్నారు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్
