Pawan Kalyan
Mahesh Goud: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ అగ్రనేతలు కలిసి భిక్షాం దేహీ అని అడిగారని అన్నారు. పవన్ ఆంధ్ర నాయకుడని, ఆయన చెబితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు.
పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని చెప్పారు. పవన్ కల్యాణ్‌ను దిష్టి కల్యాణ్ అని అన్నారు. ఆయన ఆంధ్రాలో రాజకీయం చేసుకోవాలంటూ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు.
కాగా, పవన్ కల్యాణ్ జనవరి 7, 8వ తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది.
మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. సూర్యాపేటలో ఏకగ్రీవ ఫలితాలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులు 12 ప్రాంతాల్లో ఏకగ్రీవమయ్యారు. మిగతా ఇద్దరు బీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగినవారు.