×
Ad

‘పవన్ హఠావో’ బుక్ రచయిత హత్య మిస్టరీ వీడింది.. చంపింది వీళ్లే..

హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రించే ప్రయత్నం చేశాడు.

Khammam: రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక విభేదాలే కారణమని నిర్ధారించారు. అతని స్నేహితుడు మేకల వేణుమాధవ్ రెడ్డి రూ.5 లక్షలకు కిరాయి హంతకులను నియమించి, హత్య చేయించాడు.

హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రించే ప్రయత్నం చేశాడు. అతడితో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు కూసుమంచిలో అరెస్టు చేసి, కస్టడీకి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, జనసేన కార్యకర్తలకు ఈ నేరంతో ఎటువంటి సంబంధమూ లేదని అధికారులు స్పష్టం చేశారు.

నందికొట్కూరుకు చెందిన శ్రీనివాస్ దాదాపు 20 సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివసిస్తూ రచయితగా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందాడు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో సత్తెనపల్లికి చెందిన వేణుమాధవ్ రెడ్డితో కలిసి చదివాడు. పూర్వ విద్యార్థుల సమావేశంలో మళ్లీ కలుసుకున్నారు.

శ్రీనివాస్ “బొగ్గుల బీబీక్యూ” పేరిట జీఎస్టీ లైసెన్స్ వాడుతున్నాడు. వేణుమాధవ్ “మేకా ప్రాజెక్ట్స్” పేరిట కాంట్రాక్టు సంస్థ నడిపాడు. శ్రీనివాస్ జీఎస్టీ లైసెన్స్ ఆధారంగా నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి జీఎస్టీ రీఫండ్‌లు తీసుకోవడం, లాభాలను సమానంగా పంచుకోవడం అనే ప్రతిపాదన వేణుమాధవ్ పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

2022 నుంచి 2025 మధ్య జీఎస్టీ ఫైలింగ్‌ల ద్వారా దాదాపు రూ.90 లక్షలు సంపాదించిన వేణుమాధవ్.. శ్రీనివాస్ వాటా రూ.45 లక్షల్లో రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన రూ.30 లక్షలు చెల్లించలేదు. ఇదే సమయంలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన జీఎస్టీ అధికారులు శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసి లైసెన్స్ రద్దు చేశారు.

పెండింగ్ మొత్తం ఇవ్వాలని, లైసెన్స్ మళ్లీ చెల్లుబాటు కావాలని శ్రీనివాస్ ఒత్తిడి తెచ్చాడు. తిరిగి చెల్లుబాటు కావాలంటే రూ.కోటి పైగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని వేణుమాధవ్ చెప్పినట్టు సమాచారం. ఈ విషయంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

కిరాయి ముఠాతో హత్య
ఆ తర్వాత శ్రీనివాస్‌ను హత్య చేయాలని వేణుమాధవ్ నిర్ణయించుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అశ్వారావుపేటకు చెందిన కిరాయి ముఠా సభ్యులు పోకల కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్‌ను సంప్రదించి రూ.5 లక్షలు ఇచ్చాడు. 13వ తేదీ రాత్రి విజయవాడలో రూ.30 లక్షలు ఇస్తానని చెప్పి శ్రీనివాస్‌ను కారులో ప్రయాణానికి ఒప్పించాడు. కిరాయి హంతకులు కూడా కారులో ఉన్నారు.

14వ తేదీ తెల్లవారుజామున నకిరేకల్ నుంచి జనగాం మధ్య నిర్మానుష్య ప్రాంతంలో కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసి శ్రీనివాస్‌ను చంపేశారు. తరువాత కారును పాలేరు రిజర్వాయర్ లోకి నెట్టి, ప్రమాదంలా చూపే ప్రయత్నం చేశారు.

హత్య నిర్ధారణ తర్వాత ఏసీపీ తిరుపతి రెడ్డి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాల్ డేటా, టోల్ గేట్ల సీసీటీవీ దృశ్యాలు, మామిళ్లగూడెం వరకు ఉన్న ప్రయాణ వివరాలు, ఆర్థిక విభేదాలపై సమాచారం పరిశీలించారు.

నేరానికి వాడిన కారు వేణుమాధవ్‌దిగా తేలింది. ఈ ఘటన తర్వాత అతడు కనిపించకపోవడం అనుమానాన్ని బలపరిచింది. పోలీసులు గాలింపు జరిపి వారంలోనే నిందితులను పట్టుకున్నారు. ఈ దర్యాప్తు ఖమ్మం జిల్లా పోలీసుల పర్యవేక్షణలో జరిగింది.