నా శాఖలో కడియంకి ఏం పని?.. మళ్లీ ఇలాంటివి జరిగితే.. సీఎం రేవంత్ కు కొండా సురేఖ లేఖలో సంచలనాలు..
Konda Surekha : మంత్రి కొండా సురేఖ లేఖతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
- Sreehari A
- Updated on- July 7, 2026 / 07:01 PM IST
Konda Surekha
- కడియం వర్సెస్ కొండా.. దేవాదాయ శాఖలో మొదలైన రచ్చ
- సీఎం టేబుల్‌పైకి కడియం వ్యవహారం.. సురేఖ 3 పేజీల లేఖ కలకలం
- దేవాదాయ శాఖలో ‘పవర్ ఫైట్’.. కడియంపై కొండా సురేఖ గురి
- నా శాఖలో జోక్యం వద్దు.. కడియంపై కొండా సురేఖ వార్
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ సర్కార్‌లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సొంత పార్టీలో మంత్రుల శాఖ వ్యవహారం చిచ్చురేపింది. దేవదాయ శాఖలో దుమారానికి దారితీసింది.
మంత్రి కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాయడం సర్వత్రా రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశంగా మారింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆమె ఆరోపిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కొండా సురేఖ సీఎంకు విజ్ఞప్తి చేశారు.
లేఖలో వివరాల ప్రకారం.. జూలై 6న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై కొండా సురేఖ తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు.
శాఖ మంత్రికి తెలియకుండా సమావేశం నిర్వహించడం, దేవాలయాల అభివృద్ధి, అభివృద్ధి ప్రతిపాదనలు, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సర్వే నిర్వహణ, దేవాలయ భూముల రక్షణకు సంబంధించి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడాన్ని ఆమె ఆరోపించారు.
ఆ నిర్ణయాలు పూర్తిగా శాఖ మంత్రికే :
ఇలాంటి నిర్ణయాలను తీసుకునే అధికారం పూర్తిగా శాఖ మంత్రికే ఉంటుందన్నారు. ఎమ్మెల్యే అధికార పరిధిని దాటి వ్యవహరించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు విరుద్ధమని సురేఖ లేఖలో స్పష్టం చేశారు. తన అధికారాలను బహిరంగంగా ప్రశ్నించేలా ఈ చర్యలు ఉన్నాయన్నారు. దీని కారణంగా అధికార యంత్రాంగంలో అయోమయం ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి కొండా ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం శాఖ వ్యవహారాలకే పరిమితం కాకుండా గతంలో కూడా కడియం శ్రీహరి రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి దుష్ప్రచారం చేయించినట్టు కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పార్టీ క్రమశిక్షణకు, ప్రభుత్వ సమన్వయానికి భంగం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు.
కడియంపై కఠిన చర్యలు తీసుకోవాలి :
ఈ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నుంచి పూర్తి వివరణ కోరాల్సిందిగా ఆమె లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరారు. అలాగే, పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా ఈ అంశంపై విచారణ జరిపించాలని, కడియంపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి కొండా సురేఖ లేఖతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారు? అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి..
