Representative Image (Image Credit To Original Source)
Rajya Sabha Elections: తెలంగాణ కాంగ్రెస్.. రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పేర్లను ప్రకటించింది. దీంతో వీరిద్దరూ గురువారం నామినేషన్ల దాఖలు చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉంది. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయిన అభిషేక్ సింఘ్వికి మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. లాస్ట్ టర్మ్ లో ఏడాదిన్నర మాత్రమే ఆ పదవిలో ఉన్నందున రెండోసారి కూడా సింఘ్వికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక రెండో స్థానం కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఓకే చేసింది. వేం నరేందర్ రెడ్డి చాలా కాలంగా పార్టీకి విశేషమైన సేవలు అందిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ ఆయనకు అవకాశం ఇచ్చింది. గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ హైకమాండ్ నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. గురువారం ఉదయం 11 గంటలకు వేంనరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్విలు అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు.