Chicken Price Hike : నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా చికెన్ ధర.. ఒక్క రోజులోనే ఎంత పెరిగిందంటే..

Chicken Price Hike : చికెన్ లవర్స్ కి భారీ షాక్.. నగరంలో ఒక్క రోజు చికెన్ ధరలు కొండెక్కాయి. కేజీ ధర ఎంత ఉందంటే..

ramzan 2026 effect chicken price increase upto rs 350 per kg in hyderabad

Chicken Price Hike : ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే.. తెలంగాణలో మాంసం వినియోగం చాలా అధికం. తెలంగాణలో పండగ, పబ్బం, పెళ్లి, పుట్టుక.. ఆఖరికి చావు ఇలా ప్రతి సందర్భంలో మాంసాహారం తప్పనిసరి. ముక్క లేందే ఇక్కడి ప్రజలకు ముద్ద దిగదు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆదివారం అయితే చాలు భోజనంలో ముక్క ఉండాల్సిందే. చికెన్ అమ్మకాలు భారీగా సాగుతుంటాయి. అయితే తాజాగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కోడి ధర బాగా పెరిగిపోయింది. ఉగాది, రంజాన్, వీకెండ్ కావడంతో చికెన్‌కి డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ధర కూడా ఆ స్థాయిలోనే ఉంది.

నేడు రంజాన్ కావడంతో చికెన్‌కి డిమాండ్ భారీగా పెరగడంతో.. ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నిన్నటి వరకూ కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.320 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.30 వరకు పెరిగింది. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ నగరంలో కేజీ చికెన్ రేటు రూ.340-రూ.350 మధ్య పలుకుతోంది. ఇక నాటు కోడి ధరల గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది. నగరంలో నాటుకోడి రేటు మటన్ ధరతో పోటీ పడుతోంది. నాటుకోడి కేజీ ధర రూ.800 వరకూ చెబుతున్నారు.

అయితే చికెన్ రేటు ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం.. సప్లై తగ్గడమే అంటున్నారు. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడటంతో డిమాండ్‌కు తగిన విధంగా సప్లయ్ లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హలీమ్, ఇతర వంటకాల కారణంగా చికెన్ వినియోగం పెరిగిందని అంటున్నారు. అలాగే వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణం అంటున్నారు. కేజీ చికెన్ ధర దాదాపు అరకిలో మటన్ రేటుకు చేరువవుతుండటంతో చాలామంది వినియోగదారులు చేపలు వంటివి కొనుగోలు చేస్తున్నారు.