Farming Ban : ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటలు సాగు చేయవద్దు
Farming Ban : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ 4 గ్రామాల్లో సాగు చేయవద్దన్నారు.
- Dharani Pilli
- Published on- April 21, 2026 / 07:36 AM IST
rangareddy district collector bans farming in pharma city acquired lands ibrahimpatnam
Farming Ban : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నాలుగు గ్రామాల రైతులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు ఇకపై అక్కడ వ్యవసాయం చేయకూడదని తెలిపారు. తాజాగా రంగారెడ్డి జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ అంశంపై రైతులకు అవగాహన కల్పించింది. దీనిలో భాగంగా ఆర్డీవో.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో.. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను పరిశీలించారు. కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆర్డీవో.. అక్కడి అసైన్డ్ భూముల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామాల భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన తాజా ఆదేశాలను ఈ సందర్భంగా రైతులకు వివరించారు.
ఫార్మాసిటీ నిర్మాణం కోసం గతంలోనే ప్రభుత్వం సుమారు 14 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించినట్లు ఆర్డీవో గుర్తు చేశారు. ఈ క్రమంలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చి.. ప్రభుత్వం నుంచి పరిహారం అందుకున్న రైతులు.. రానున్న వర్షాకాలంలో ఈ భూముల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు వేయకూడదని, ఎలాంటి పంటలు సాగు చేయవద్దని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
ఫార్మాసిటీకి భూములు ఇచ్చి.. నష్టపరిహారం పొందిన తర్వాత ఇక వాటిపై కేవలం ప్రభుత్వానికే హక్కులు ఉంటాయని.. కనుక ఆ భూముల్లో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. రైతులు అధికారుల సూచనలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సాగు చేస్తే చర్యలు తప్పవన్నారు.
హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ కోసం భూముల స్వాధీనం విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో భూసేకరణ సమయంలో కొన్ని గ్రామాల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ఇప్పటికే చాలా మంది రైతులకు పరిహారం అందించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూములను అభివృద్ధి పనులకు సిద్ధం చేస్తున్న తరుణంలో.. అక్కడ మళ్లీ సాగు చేపడితే పనులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ భూముల్లో సాగు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.
