వావ్ సూపర్… వారందరికీ రెడీమేడ్ ఇందిరమ్మ ఇళ్లు.. భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారందరికీ రెడీమేడ్ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది.
- Dharani Pilli
- Updated on- March 31, 2026 / 10:46 AM IST
readymade indiramma illu to land owners who evicted for kakatiya mega textile park
Indiramma Illu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెడీమేడ్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకుంది. మరి ఈ ఇళ్లు ఎవరికంటే.. వరంగల్‌లో ఏర్పాటు చేయబోతున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ రెడీమేడ్ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు జిల్లా అధికారులు రెడీ అవుతున్నారు. ఈ టెక్స్‌టైల్ పార్క్ కోసం వరంగల్‌లోని సంగెం, గీసుగొండ మండలాల పరిధిలో మొత్తం 1,250 ఎకరాల భూమిని సేకరించింది. ఈ క్రమంలో 863 మంది నిర్వాసితులకు పార్క్ దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనుంది.
అలానే రెండేళ్లలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభించే సమయానికి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు.. రైతుల కోసం రాజీవ్‌గాంధీ టౌన్‌షిప్ పేరుతో కొత్త ఊరు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో రూ. 10.10 కోట్లతో తొలి దశ మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
ఈ ఊరిలో మంచినీటి సౌకర్యం, అంతర్గత (ఇన్నర్) రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ కనెక్షన్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. వీటితో పాటు.. ఈ గ్రామంలో ప్రైమరీ స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు.. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొత్త గ్రామపంచాయతీగా అభివృద్ధి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. తక్కువ సమయంలో రెడీమేడ్ ఇండ్ల నిర్మాణం జరిగేలా అడుగులు వేస్తోంది. భూకంపాలను తట్టుకునే స్థాయిలో వీటి నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు.
