Telangana Govt : తెలంగాణలోని ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో ఐదు రోజులే పనిదినాలు..!
Telangana Govt : సెక్రటేరియెట్ లో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్సీ, బదిలీలు, వివిధ విభాగాల సమస్యలపై సీఎస్ కు వినతిపత్రాలు అందజేశారు.
- Harish Thanniru
- Published on- May 16, 2026 / 09:07 AM IST
Telangana Govt
- ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలు
- పరిశీలన చేస్తున్న తెలంగాణ సర్కార్
- ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించేలా హామీ
Telangana Govt : ప్రభుత్వం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారంలో ఐదు రోజులు పనిదినాలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read : Bandi Bhagirath : బండి భగీరథ్ కేసు.. హైకోర్టులో దక్కని ఊరట.. అలా చేయలేమని తేల్చిచెప్పిన కోర్టు
సెక్రటేరియెట్ లో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్సీ, బదిలీలు, వివిధ విభాగాల సమస్యలపై సీఎస్ కు వినతిపత్రాలు అందజేశారు. అదేసమయంలో అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సీఎస్ కె. రామకృష్ణారావు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వారంలో ఐదు రోజుల పని విధానాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
అదేవిధంగా.. జూన్ 2లోపే రెండో పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, ఉద్యోగుల క్యాష్‌లెస్ పథకంతో తక్షణమే నగదు రహిత వైద్యం అందించాలని సీఎస్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.
సీఎస్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి నగదు రహిత హెల్త్ స్కీమ్ ను అమలు చేస్తామని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నింటిని 100రోజుల్లోపు చెల్లించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కొత్త హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల మూలవేతనంలో 1.5 శాతం వాటా, అంతే మొత్తంలో ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌తో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపిస్తామన్నారు. రెండో పీఆర్సీ నివేదిక తుది దశకు చేరిందని, అది అందగానే ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అవుతామని చెప్పారు. నెల రోజుల్లో పీఆర్సీ కమిటీ రిపోర్టు తెప్పించుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.
