Rice Price Hike : సామాన్యులకు మరో దెబ్బ! గ్యాస్, పెట్రోల్ తర్వాత ఇప్పుడు బియ్యం బాంబ్.. ధరలు పెరగడానికి కారణాలివే..
Rice Price Hike : గడిచిన ఇరవై రోజుల్లో సన్న బియ్యం ధరలు ఏకంగా 15 శాతం నుంచి 20శాతం వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా జేఎస్‌ఆర్, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, బీపీటీ రకాలపై ఈ ప్రభావం భారీగా కనిపిస్తోంది.
- Harish Thanniru
- Published on- June 24, 2026 / 11:03 AM IST
Rice Price Hike
- పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు మరో షాక్
- భారీగా పెరిగిన సన్న బియ్యం ధరలు
- తెలంగాణ సర్కార్ నిర్ణయమే కారణమా?
Rice Price Hike : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పేద, మధ్య తరగతి వర్గాలపై ఇప్పటికే గ్యాస్, ఇంధన, నిత్యావసర సరకుల ధరల భారం పడింది. వీటి ధరలు పెరగడంతో ఆయా వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా వర్గాలకు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం సన్నబియ్యం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
గడిచిన ఇరవై రోజుల్లో వీటి ధరలు ఏకంగా 15 శాతం నుంచి 20శాతం వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా జేఎస్‌ఆర్, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, బీపీటీ రకాలపై ఈ ప్రభావం భారీగా కనిపిస్తోంది. గతంలో కిలో రూ. 46 నుంచి రూ.55 ఉంటే.. ఇప్పుడు స్టీం, రారైస్ తక్కువ రకం, ప్రీమియం క్వాలిటీని బట్టి రూ.55 నుంచి రూ.63 వరకు చేరాయి. పావుకిలో బియ్యం బ్యాగ్ పై సుమారు రూ. 180 నుంచి రూ.200 పెరుగుదల చోటు చేసుకుంది.
సన్నబియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలివే..
♦ తెలంగాణలో ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఖరీఫ్ లో సాగైన పంట ఉత్పత్తులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు భారీగా వెళ్లాయి. ప్రభుత్వం వద్ద అవసరానికి మించిన సుమారు 10లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ ధాన్యం మార్కెట్లోకి రాకపోవటంతో బియ్యం కొరత ఏర్పడింది.
♦ ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో గతంకంటే సన్నాల సాగు తగ్గినట్లు మిలర్లు, బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు భారీగా తగ్గాయి.
♦ తుంగభద్ర డ్యాంకు మరమ్మతుల కారణంగా కర్ణాటక ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో యాసంగిలో పంటకు విరామం ప్రకటించింది. ఫలితంగా అక్కడి వ్యాపారులు తెలంగాణలోని నిజామాబాద్, బాన్సువాడ, బోధన్, నారాయణపేట, గద్వాల ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో సన్నధాన్యం కొనుగోళ్లు జరిపి ఆ రాష్ట్రంలోని వివిధ నగరాలకు తరలించారు. దీంతో ఇక్కడ సన్నధాన్యం కొరత ఏర్పడింది.
♦ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మిల్లర్లు పెద్దమొత్తంలో సన్నధాన్యం నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని.. ఫలితంగా సన్న ధాన్యం కొరత ఏర్పడిందని చెబుతున్నారు.
♦ తెలంగాణలో ఐదు లక్షల టన్నుల సన్న ధాన్యం వేలం పూర్తయ్యి ఈ నిల్వలు త్వరగా మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని బియ్యం ఎగుమతిదారులు పేర్కొంటున్నారు.
