Rythu Gosa BJP Bharosa: రైతులకు అండగా బీజేపీ.. “రైతు గోస-బీజేపీ భరోసా”యాత్ర..
ఈ బస్సు యాత్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం దిగొచ్చి యుద్ధ ప్రాతిపదికన, అత్యవసర ప్రాతిపదికన కొనుగోళ్లు ప్రారంభించింది.
- Naveen
- Updated on- May 27, 2026 / 04:36 PM IST
Rythu Gosa BJP Bharosa: రైతాంగ సంక్షేమం లక్ష్యంగా బీజేపీ ముందుకు కదిలింది. ఇందులో భాగంగా “రైతు గోస-బీజేపీ భరోసా” బస్సు యాత్ర చేపట్టింది. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర ఆలస్యం, మిల్లుల దగ్గర జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ బీజేపీ ఈ బస్సు యాత్రను చేపట్టింది. ఐకేపీ (IKP) కేంద్రాల్లో తార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, లారీల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టేలా మార్కెట్ యార్డులను సందర్శిస్తోంది.
ఈ బస్సు యాత్ర ప్రత్యేకత ఏంటంటే.. పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు అంతా కలిసి ఒకే బస్సులో ప్రయాణిస్తూ క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. పరిగి, కుల్కచర్ల నుంచి మొదలై గజ్వేల్, జనగామ, వరంగల్, పెద్దపల్లి వరకు ఈ యాత్ర సాగుతోంది.
ఈ యాత్రలో భాగంగా బీజేపీ బృందం గజ్వేల్ నియోజకవర్గాన్ని సందర్శించింది. తన సొంత నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నా మాజీ సీఎం కేసీఆర్ కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అందుకే బీజేపీ నేతలంతా కలిసి అక్కడి మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మేమున్నామనే భరోసా కల్పించారు.
పశ్చిమ బెంగాల్ తర్వాత కేంద్రంలోని బీజేపీకి తదుపరి టార్గెట్ తెలంగాణే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టగల లీడర్ తెలంగాణ బీజేపీకి అవసరం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదటి నుంచి పార్టీ కోసం గట్టిగా నిలబడుతూ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశాలను ముందే గుర్తిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన గళం వినిపిస్తున్నారు. అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ‘బీజేపీ ఫ్లోర్ లీడర్’గా సమర్థవంతగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కలను తూర్పారబడుతూ.. కేవలం 25-30% కొనుగోళ్లు మాత్రమే జరిగాయని క్షేత్రస్థాయి ఆధారాలతో ఆయన నిలదీస్తున్నారు.
కేవలం బస్సు యాత్రలకే పరిమితం కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను, అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టడంలో మహేశ్వర్ రెడ్డి ముందున్నారు. రైతు గోస – బీజేపీ భరోసా యాత్రలో భాగంగా మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. “హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్, కమిషన్ల దందాలో మునిగిపోయి రాష్ట్రాన్ని, రైతన్నను గాలికి వదిలేసిన విషయం వాస్తవం కాదా?” అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు..
ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న ఈ బస్సు యాత్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం దిగొచ్చి యుద్ధ ప్రాతిపదికన, అత్యవసర ప్రాతిపదికన కొనుగోళ్లు ప్రారంభించింది. రైతన్నను ఆదుకోవడమే భారతీయ జనతా పార్టీ అంతిమ లక్ష్యం. కొనుగోళ్ల ప్రక్రియలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం కూడా మహేశ్వర్ రెడ్డి ఒత్తిడి, బీజేపీ క్షేత్రస్థాయి పోరాటం వల్లే సాధ్యమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ యాత్ర కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతున్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కేవలం మాటలు సరిపోవని, వ్యూహాత్మకమైన ఉమ్మడి పోరాటాలు అవసరం అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ బస్సు యాత్ర పార్టీలో గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి, క్యాడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
