×
Ad

Vijay Reddy Family Tragedy : ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి కేసులో వీడిన మిస్టరీ .. వాళ్ల మృతికి కారణం అదే..

Vijay Reddy Family Tragedy : ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ వీడింది.

Vijay Reddy Family Tragedy

  • విజయారెడ్డి ఫ్యామిలీ బలవన్మరణం కేసులో వీడిన మిస్టరీ
  • డిప్రెషన్‌తోనే బలవన్మరణంకు పాల్పడినట్లు నిర్దారణ
  • డిప్రెషన్ అంశంపై మరింత లోతుగా పోలీసులు విచారణ

Vijay Reddy Family Tragedy : ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ వీడింది. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణంకు పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు. కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్న విజయారెడ్డి.. పిల్లలతో కలిసి బలవన్మరణం చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు.

Also Read : Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..

విజయరెడ్డి, సురేందర్ రెడ్డిలకు 2007లో వివాహమైంది. సురేందర్ రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో ఆయన అక్కడకు వెళ్లి జాబ్ చేస్తున్నాడు. రాఘవేంద్ర నగర్‌లో తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి ఉంటున్నారు. ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా ఆమె పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు విశాల్ రెడ్డి, చేతన రెడ్డి. వారు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే, జనవరి 30న ఆత్మహత్యకు ముందు బంధువు చనిపోయారని చెప్పి హాస్టల్ నుంచి పిల్లలను బయటకు తీసుకొచ్చిన విజయారెడ్డి.. వారితో కలిసి రైల్వే స్టేషన్ కు వెళ్లింది.

30వ తేదీ రాత్రి సుమారు 10.30 నుంచి 11గంటల మధ్య పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లిన విజయారెడ్డి, కారును ఆవరణలో పార్కు చేసి కారు తాళాలు కొడుకు జేబులో పెట్టింది. ఆ తరువాత ముగ్గురు రైల్వే స్టేషన్‌లోకి వెళ్లారు. చర్లపల్లి – ఘట్‌కేసర్ ప్లాట్‌పాంపై నడుచుకుంటూ వెళ్లి.. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటిగంట సమయంలో ఇద్దరు పిల్లలను గుండెకు హత్తుకుని రైలు కిందపడి ప్రాణాలు వదిలారు.

విజయారెడ్డి, ఇద్దరు పిల్లల బలవన్మరణంపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. అనేక కోణాల్లో లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మొబైల్ సీడీఆర్, డేటా రీట్రీవ్, ఇతర టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాల ప్రకారం విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన కీలక అంశాలను పోలీసులు సేకరించారు.

ఆత్మహత్యకు ముందు విజయారెడ్డి ఎవరితో మాట్లాడింది అనే విషయాలపై ఆరా తీశారు. విజయారెడ్డి బంధువులు, ఆమె భర్తతోపాటు పలువురిని పోలీసులు విచారించారు. అన్ని కోణాల్లో విచారణ అనంతరం డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు.

డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. కొంతకాలంగా ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. మొదటి నుంచి పిల్లలు తల్లి విజయారెడ్డి మాటను అనుసరించేవారు. పిల్లలపై ఉన్న పూర్తి నియంత్రణతోనే విజయారెడ్డి వారిని వెంట తీసుకెళ్లారు. తల్లి చెప్పిందే చేయాలనే స్థితిలో ఉండి, ఆమెతో కలిసి పిల్లలు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, విజయారెడ్డి వద్ద రెండో ఫోన్ ఉందని వార్తలొచ్చాయి. విజయారెడ్డి రెండో ఫోన్ వినియోగించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరణానికి ముందు వారం రోజుల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు..