Kavitha Party : తెలంగాణలో మరో కొత్త పార్టీ.. మార్చి 27న ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత
Kavitha Party : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
- Dharani Pilli
- Published On : March 25, 2026 / 04:06 PM IST
sources said kalvakuntla kavitha announce new political party on 2026 march 27 from nizamabad
Kavitha Party : తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఉగాది నాడు కవిత కొత్త పార్టీపై ప్రకటన చేస్తారని భావించారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కవిత కొత్త ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి నాడు అనగా మార్చి 27న కవిత కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారని సమాచారం.
తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి పార్టీ ఏర్పాటుపై కవిత ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పార్టీ గుర్తు, విధివిధానాలతో పాటుగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించనున్నారని సమాచారం.
కల్వకుంట్ల కవిత మార్చి 27 శుక్రవారం, శ్రీరామనవమి రోజున ఉదయం 8 గంటలకు కొత్త పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పుడీ వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మార్చి 27న కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.
కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె.. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె, ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరి కవిత పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
