Telangana Assembly: అసెంబ్లీలో ఇప్ప సారా మంటలు .. బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
ఇందిరమ్మ మా దేవత, వాజ్ పేయే ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాత అన్నారు. రాకేశ్ రెడ్డి మాటలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి.
- Naveen
- Published On : March 25, 2026 / 06:57 PM IST
Telangana Assembly: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇప్ప సారా అంశం అసెంబ్లీలో రచ్చకు దారితీసింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్ప సారా విషయంలో ఇందిరమ్మ పేరు వాడారు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి. అంతే కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇప్ప సారా తీసుకురావాలన్న రాకేశ్ రెడ్డి.. ఇప్ప సారా పథకం తెచ్చి ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దంటూ సెటైర్లు వేశారు. ఆయన వాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి. ఇప్ప సారా విషయంలో ఇందిరమ్మ పేరు వాడటంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
”ఇప్ప సారా ఉత్తర తెలంగాణకు ఉపయోగపడే అంశం. టకీలా అని అనిరుధ్ రెడ్డి మంచి పేరు పెట్టారు. కల్తీ కల్లు, కల్తీ మద్యం తాగి ఉత్తర తెలంగాణ ప్రజలు శవాలుగా మారుతున్నారు. ఇప్ప సారా ఆర్గానిక్ విస్కీ. కల్తీ మద్యం, అల్ఫజోలం, కల్లు కంటే ఇప్ప సారా మంచిది. ఇప్ప టకీలా అనండి, ఇంకేమైనా పేరు పెట్టండి. కానీ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి” అంటూ రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ మా దేవత..
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఫైర్ అయ్యారు. ”ఇందిరమ్మ మా దేవత, వాజ్ పేయే ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాత అన్నారు. ఇప్ప టకీలాకు ఇందిరమ్మ పేరు పెట్టాలనడం సరికాదు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలి. చనిపోయిన ఇందిరమ్మ పేరు ఉపయోగిస్తారా? పైడి రాకేష్ రెడ్డి వాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి. ఇందిరమ్మను అవమానించడం అంటే మహిళా సమాజాన్ని అవమానించినట్లే” అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
”రాకేశ్ రెడ్డి మాటలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. మత్తు అనేది పెద్ద చెత్త. ఇందిరమ్మ మీద మీ అక్కసు శోచనీయం. సంక్షేమ పథకాలకు గొప్ప వారి పేర్లు పెడతారు. అందుకే ఇందిరమ్మ పేర్లు పథకాలకు పెట్టాం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఇందిరమ్మ అంటే ఎందుకంత విద్వేషం? వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ మాటలను రాకేష్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి” అని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని మరో మంత్రి శ్రీధర్ బాబు సైతం డిమాండ్ చేశారు. దేశం కోసం త్యాగం చేసిన ఇందిరమ్మ గురించి ఇలా మాట్లాడతారా? అని సీరియస్ అయ్యారాయన. దీనిపై ప్రోటమ్ స్పీకర్ బాలు నాయక్ స్పందించారు. రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ సభ్యులపై ఫైర్ అయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి కల్పించుకుని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్ పార్లమెంటరీ భాష ఎక్కడా మాట్లాడలేదన్నారు.
Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. మార్చి 27న ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత
