Chicken Price Hike : నాన్ వెజ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. చికెన్ ధర పైపైకి.. కేజీ రూ.400.. దిగి వస్తోన్న గుడ్డు.. ఒక్కటి రూ.5
Chicken Price Hike : తెలంగాణలో చికెన్ ధర రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు కోడి గుడ్డు ధర మాత్రం దిగి వస్తోంది.
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 10:16 AM IST
telangana chicken prices soar to record rs 370 kg amid weddings eason demand and supply shortage egg price dropped
Chicken Price Hike : రాష్ట్రంలో ముక్క లేకపోతే ముద్ద దిగని వారు కోకొల్లలు. కొందరికి వారం మొత్తం ముక్క ఉండాల్సిందే. ఆదివారం వస్తే చాలు.. కోడి చికెన్, మేక మటన్ ఏదో ఒకటి ఉడకాల్సిందే. అయితే ఇప్పుడీ పరిస్థితి మారుతోంది. కారణం చికెన్ ధర మటన్ తో పోటీ పడుతూ మరీ పెరగడం. అయితే ఇక్కడ కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. చికెన్ ధర పెరిగితే.. కోడిగుడ్డు ధర మాత్రం భారీగా దిగి వస్తోంది. ఒకానొక సమయంలో ఒక్క గుడ్డు ధర రూ. 8 వరకు పెరగ్గా.. ఇప్పుడది రూ. 5 కు పడిపోయింది.
ప్రస్తుతం పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 360-370 మధ్య ఉంది. ఇదే సమయంలో యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో గుడ్డు రేటు పడిపోయింది. ప్రస్తుతం రూ. 4.50 నుంచి రూ. 5 మధ్య పలుకుతోంది.
గత కొన్ని రోజులుగా.. ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు. మన దగ్గర డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో.. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, మహారాష్ట్రల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. అందువల్లే చికెన్ రేటు భారీగా పెరిగిందని.. ఇదే పరిస్థితి కొనసాగితే.. మరికొన్ని రోజుల్లో కేజీ చికెన్ రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు ఇంత భారీగా పెరిగాయి. వారం రోజుల కింద కేజీ చికెన్ రూ. 320 వరకు పలకగా.. నిన్న చాలా కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ. 380 వరకు అమ్ముడైంది. ఇదిలా ఉంటే నాటు కోడి ధర కేజీ రూ. 700 నుంచి రూ. 800 మధ్య పలుకుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం చికెన్ ధర పెరుగుతుండగా.. కోడిగుడ్డు ధర మాత్రం దిగి వస్తోంది. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కోడిగుడ్డు ధరలు దిగి వస్తున్నాయి. ఇదే రెండు నెలల క్రితం వరకు రిటైల్‌లో రూ. 8 వరకు పలికిన ఒక్కో గుడ్డు.. ప్రస్తుతం రూ. 5 పలుకుతోంది.
ఎండల కారణంగా బాయిలర్ కోళ్లు చనిపోతుండటంతో డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై ఉండటం లేదు. దీనితో పాటు పెరుగుతున్న ఎండల వల్ల కోళ్లు దానా తక్కువ తిని నీళ్లు ఎక్కువగా తాగుతున్నాయని.. దీని వల్ల వాటిల్లో ఆశించిన మేర ఎదుగుదల ఉండటం లేదంటున్నారు. కోళ్లను కాపాడుకునేందుకు కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం వల్ల అదనపు భారం పడుతోంది. దీంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు వేసవిలో కోళ్ల పెంపకాన్ని నిలిపివేయడంతో సప్లై చాలా వరకు తగ్గి.. ధర పెరుగుతుంది అంటున్నారు.
