Telangana Cold Wave Alert : తెలంగాణను వణికిస్తున్న చలిపులి.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. మరో 3 రోజులు జాగ్రత్త!

Telangana Cold Wave Alert : తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుంది. రానున్న 3 రోజులు 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. పొగమంచు, చలి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana Cold Wave Alert

  • చలికి గజగజ.. తెలంగాణలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు
  • పొద్దున్నే పొగమంచు.. రాత్రికి గజగజ వణుకు
  • 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Telangana Cold Wave Alert : తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఇప్పటికే చలికి జనం గజగజ వణుకుతుంటే.. రానున్న 3 రోజులు పరిస్థితి మరింత తీవ్రంగా మారనుంది. రాత్రి వేళల్లోనే కాదు.. తెల్లవారుజామున కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి..

కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం :
ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. జోగులాంబ గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంగారెడ్డి, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా 12 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..

Read Also : Weather Alert : ఒకవైపు వణికిస్తున్న చలి.. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, చలి తీవ్రత!

పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు :
చలి తీవ్రతకు తోడు తెల్లవారుజామున పొగమంచు కూడా కమ్ముకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. దీంతో వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.

ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత :
రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 14.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో 16.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటమే చలి పెరగడానికి ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి మరో 3 రోజులు తెలంగాణలో చలి ప్రభావం కొనసాగనుంది. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది..