HCA ని రద్దు చేయాలి.. మంత్రి వివేక్ రాజీనామా చేయాలి: TCA కార్యదర్శి గురువా రెడ్డి
టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని రద్దు చేయాలని.. మంత్రి వివేక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- Dharani Pilli
- Published On : March 5, 2026 / 07:03 PM IST
Telangana Cricket Association Secretary Gurava Reddy latest comments about hca
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) విలీనంపై బాంబే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని తెలిపారు. ఈ అంశంపై రెండు సంస్థలు కలిసి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు. నాలుగు వారాల్లో కొలాబరేషన్ పై అఫిడవిట్ సబ్మిట్ చేయమని చెప్పిందన్నారు.
TCA ఇచ్చిన ప్రపోజల్ పై సమాధానం చెప్పకుండా జిల్లాల్లో క్రికెట్ చేస్తామని మాటలు చెబుతున్నారు. కేవలం బీసీసీఐ ఇచ్చే డబ్బుల పట్ల ఉన్న శ్రద్ధ క్రికెట్ అభివృద్ధిపై HCA కి లేదు. అర్హత లేకుండా సీఈఓని నియమించారు, కొత్త అధ్యక్షుడిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారు. ప్రజల సొమ్ము, తెలంగాణ క్రీడాకారులకు వినియోగించాల్సిన సొమ్మును విశాఖ ఇండస్ట్రీస్ కి బదిలీ చేశారని గురువారెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంటే.. క్రికెట్ అసోసియేషన్ వాళ్ల మాటే వింటుందన్నారు. జీతాలు లేవని HCA ఉద్యోగులు గొడవ చేస్తుంటే విశాఖ ఇండస్ట్రీస్ కు మాత్రం కోట్ల రూపాయలు బదిలీ చేస్తున్నారని గురువారెడ్డి ఆరోపించారు. ఈ నగదు బదిలీ వెనుక క్విడ్ ప్రో కో జరగలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేయాలని, మంత్రి వివేక్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. HCA అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి యువతకు వినియోగించాల్సిన డబ్బును దోచుకుపోయారని ఆరోపించారు. HCA కేసుపై తదుపరి దర్యాప్తు ఎందుకు కొనసాగట్లేదు.. మంత్రి, అజారుద్దీన్ ఒత్తిళ్ల వల్ల కాదా అని ప్రశ్నించారు. మీ వల్ల సాధ్యం కాకపోతే కేసు సీఐడీకి ఇవ్వాలని, కేసు దర్యాప్తుకు సంబంధించి మరోసారి సీఐడీకి, డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు.
