Fee Reimbursement: ఫీజులపై విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకే డబ్బులు.. పడే తేదీలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) విధానంలో కీలక మార్పులు చేపట్టి విద్యార్థులకు మరింత పారదర్శకమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- V Santhosh Kumar
- Updated on- June 10, 2026 / 10:45 AM IST
telangana fee reimbursement new scheme students bank accounts direct payment 2026
-
విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు జమ
-
మూడు విడతల్లో నిధుల విడుదల
-
స్కాలర్‌షిప్ ప్రక్రియకు కొత్త నిబంధనలు
Fee Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో కీలక మార్పులు చేపట్టి విద్యార్థులకు మరింత పారదర్శకమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, దివ్యాంగ విద్యార్థులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కాలేజీల ఖాతాల్లో జమయ్యే ఫీజు మొత్తాన్ని ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అడ్మిషన్ల తేదీల ఆధారంగా ఏడాదిలో మూడు విడతలుగా నిధులు విడుదల చేసే షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో ఫీజు విడుదల ఎప్పుడు జరుగుతుందనే విషయంపై విద్యార్థులకు ముందుగానే స్పష్టత లభించనుంది.
*ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక నెల తొలి తేదీనే జీతం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
మూడు విడతల్లో నిధుల విడుదల:
ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 15న, ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య అప్లై చేసిన వారికి డిసెంబర్ 30న, డిసెంబర్ 1 నుంచి జనవరి 31 మధ్య దరఖాస్తు చేసిన వారికి ఫిబ్రవరి 28న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) నిధులు జమ చేయనున్నారు. ఫిబ్రవరి, మార్చిలో ఆలస్యంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు దరఖాస్తు చేసిన 75 రోజుల్లోపు నిధులు విడుదల చేస్తారు. ఫేక్ అడ్మిషన్లకు అడ్డుకట్ట వేసేందుకు 75 శాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. అలాగే ఈపాస్ పోర్టల్ ద్వారా ధ్రువపత్రాల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
మెయింటెనెన్స్ ఫీజులకు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు:
విద్యార్థుల హాస్టల్, ఇతర విద్యా అవసరాల కోసం ఇచ్చే మెయింటెనెన్స్ ఫీజు (ఎంటీఎఫ్) మొత్తాలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రొఫెషనల్, పీజీ కోర్సుల విద్యార్థులకు హాస్టల్‌లో ఉంటే నెలకు రూ.1,500, డే స్కాలర్లకు రూ.650 చొప్పున అందజేస్తారు. డిగ్రీ విద్యార్థులకు రూ.1,000/రూ.500, ఇంటర్ విద్యార్థులకు రూ.750/రూ.500 చొప్పున పది నెలల పాటు చెల్లిస్తారు. దివ్యాంగ విద్యార్థులకు అదనంగా 10 శాతం సాయం అందించనున్నారు. ఒకసారి నమోదు చేసుకున్న విద్యార్థులకు తదుపరి సంవత్సరాల్లో ఆటోమేటిక్ రెన్యూవల్ సౌకర్యం కల్పించడంతో స్కాలర్‌షిప్ ప్రక్రియ మరింత సులభం కానుంది.
