Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 2.5లక్షల మందికి శుభవార్త.. జూన్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభం..
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేద వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని 2.5లక్షల మంది పేద వర్గాల ప్రజలకు ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
- Harish Thanniru
- Updated on- May 24, 2026 / 08:41 AM IST
CM Revanth Reddy Indiramma Housing Scheme
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- జూన్ 1 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం
- రాష్ట్రంలో 2.5లక్షల ఇండ్ల నిర్మాణంకు నిర్ణయం
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేద వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో పేదల ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తీర్మానించింది. జూన్ 1 నుంచి ఇందిరమ్మ పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2.5లక్షల ఇళ్లు మంజూరుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణలోని ఇండ్లు లేని నిరుపేదలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే మొదటి విడత కింద పేద వర్గాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా.. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని 2.5లక్షల మంది పేద వర్గాల ప్రజలకు ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు అనుమతి ఇచ్చింది. అయితే, తొలి విడతలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లలో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు లక్ష గృహ ప్రవేశాలు జరగాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో నిర్వహించిన సర్వేల ప్రకారం.. 15వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లో నివాసం ఉంటున్నారని, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంజూరు చేసి, పూర్తికాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో క్యూర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లోని పేదలకు లక్ష ఇండ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది.
కొలాం ఆదివాసీలకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లను జూన్1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు కావాల్సిన భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లను కేటాయిస్తూ.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.
