Velugumatla Bhoodan Victims Indiramma Illu : భూదాన్ బాధితులకు భారీ ఊరట.. కూల్చిన చోటే వారికి ఇందిరమ్మ ఇళ్లు..!
Velugumatla Bhoodan Victims Indiramma Illu : వెలుగుమట్ల భూదాన్ బాధితుల విషయంలో ప్రభుత్వం దిగి వచ్చింది. బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పింది.
- Dharani Pilli
- Published On : March 11, 2026 / 08:59 AM IST
telangana government distribute indiramma Illu to the khammam velugumatla bhoodan victims
Velugumatla Bhoodan Victims Indiramma Illu : తెలంగాణలో గత కొన్ని రోజులుగా వెలుగుమట్ల భూదాన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం శివారులో ఉన్న వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే అవి ప్రభుత్వ భూములని, తక్షణమే వాటిని ఖాళీ చేయాలంటూ పది రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఇళ్లను నెలమట్టం చేశారు. దీంతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీటు రాజేసింది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు ధ్వజమెత్తాయి. పేదలను నిరాశ్రయులను చేసి.. పెద్దలకు ఆ భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ విమర్శలు చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం వెలుగుమట్ల బాధితులను పరామర్శించి.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. వెలుగుమట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో.. ప్రభుత్వం దిగి వచ్చింది. బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించింది.
‘భూదాన్’ నిర్వాసితుల కష్టాలు తీరనున్నాయి. వారి ఇళ్లను కూల్చిన చోటే అర్హులైన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఆ ప్రాంతాన్ని చదును చేసే పనులు ప్రారంభించింది. అలానే గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా అర్హులైన బాధితులను గుర్తించిన ప్రభుత్వం.. వారికి ప్రభుత్వ స్థలంతో పాటు.. ఇందిరమ్మ ఇళ్లను బుధవారం మంజూరు చేసింది.
ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మొత్తం 412 కుటుంబాలు
వెలుగుమట్ల, వినోబాభావే నగర్‌లోని భూదాన్ భూమిలో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న సుమారు 742 కుటుంబాలకు చెందిన ఇళ్లను.. ఫిబ్రవరి 24న అధికారులు తొలగించారు. బాధితులు నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని.. వారిని తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు, సీసీఎల్‌ఏ (CCLA) జారీ చేసిన ఆదేశాల మేరకు ఇళ్లను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. అధికారుల చర్యతో ఇళ్లను కోల్పోయిన బాధితులు రోడ్డున పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కుటుంబాలు సొంత ఊర్లకు వెళ్లగా.. మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లారు.
మరో 134కు పైగా కుటుంబాలు టీటీడీసీ (TTDC), అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయి. ఈ క్రమంలో విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు బాధితులకు మద్దతుగా ఆందోళనకు దిగడంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులను గుర్తించడానికి రెవెన్యూ అధికారులు కూల్చివేత చిత్రాలు, ఆధార్, రేషన్ కార్డుల ఆధారంగా చిరునామాలు సేకరించారు.
ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న మొత్తం 742 కుటుంబాల్లో.. 412 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి మంగళవారం కలెక్టరేట్‌లో టోకెన్లు పంపిణీ చేయగా.. 311 మంది తీసుకున్నారు. సొంత గ్రామాల్లో స్థలం కలిగిన మరో 101 మంది లబ్ధిదారులకు అక్కడే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిసింది.
