Moinabad Farm House Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు.. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజు నోటీసులు

Moinabad drugs case : మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది.

Moinabad Farm House Case

Moinabad drugs case : మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ మూలాల‌పై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, నిమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, డ్రగ్స్ దందాపై సిట్ విచారణ చేయనుంది.

Also Read : Moinabad Farm House Case: పోలీసులను గాయపరిచి పారిపోవాలని ప్లాన్..! మొయినాబాద్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో ఈనెల 14న రాత్రి జరిగిన పార్టీపై తెలంగాణ ఈగల్, మొయినాబాద్ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో ఈ డ్రగ్స్, మద్యం పార్టీకి రోహిత్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఈ పార్టీలో మొత్తం 11మంది పాల్గొనగా.. మహేశ్ కుమార్, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ తదితరులంతా మద్యంలో కొకైన్ కలిపి తాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ వ్యవహారంలో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. మూడు నుంచి ఐదు రోజుల కస్టడీ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు..
ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సోమా భరత్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశం విస్తృతంగా మీడియాలో ప్రచారం వల్ల పార్టీ ప్రతిష్టకు, ప్రజల్లో ఆందోళనకు దారితీసిందని, బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలను పాటించడంలో కట్టుబడి ఉందని అన్నారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం, వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా  వ్యతిరేకిస్తుంది. మీపై వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన, సమగ్ర లిఖితపూర్వక వివరణను వారం రోజుల్లో సమర్పించాలని రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. పార్టీ అధిష్టానం తదుపరి నిర్ణయం వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని పార్టీ అధిష్టానం హెచ్చరించింది. పార్టీ ప్రతిష్ట విషయంలో రాజీ పడేది లేదని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.