Telangana Job Cards: గ్రామీణ ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. కొత్త జాబ్‌కార్డులకు గ్రీన్ సిగ్నల్.. 15 రోజుల్లోనే
కరువు మండలాల కూలీలకు ఉపాధి కల్పించేందుకు వీబీ జీరాంజీ పథకం కింద జాబ్‌కార్డుల(Telangana Job Cards)ను మంజూరు చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశించింది.
- V Santhosh Kumar
- Updated on- October 4, 2026 / 09:50 PM IST
Telangana government inviting applications for new job cards in drought-affected districts.
Telangana Job Cards: ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురై పంట సాగు తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కరువు మండలాల కూలీలకు ఉపాధి కల్పించేందుకు వీబీ జీరాంజీ (ఉపాధి హామీ) పథకం కింద కొత్తగా జాబ్‌కార్డులను మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 265 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన సర్కార్, గ్రామీణ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామంలోనే ప్రతిరోజూ 100 నుంచి 150 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
15 రోజుల్లోనే జాబ్‌కార్డ్ మంజూరు.. దరఖాస్తు విధానం ఇదిగో:
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 18 ఏళ్లు నిండిన పౌరులు ఎవరైనా ఈ జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారు నిర్ణీత ఫారమ్‌ను(Telangana Job Cards) పూరించి, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను జత చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమర్పించాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక తనిఖీ తర్వాత దరఖాస్తును ఎంపీడీవో కార్యాలయానికి పంపుతారు. అర్హతలను పరిశీలించిన అనంతరం కేవలం 15 రోజుల్లోనే జాబ్‌కార్డు మంజూరు చేసేలా ప్రభుత్వం నిబంధనలు సవరించింది.
పెరిగిన వేతనం, వారం రోజుల్లోనే నగదు సీబీటీ.. ఉపాధికి భరోసా:
ప్రస్తుతం రాష్ట్రంలో 52.46 లక్షల కుటుంబాలకు చెందిన 1.08 కోట్ల మందికి ఇప్పటికే జాబ్‌కార్డులు ఉండగా, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి తక్షణమే పనులు కేటాయించనున్నారు. వీబీ జీరాంజీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. కనీస వేతనం పెంపుతో పాటు, పని చేసిన వారం రోజుల్లోనే నేరుగా కూలీల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం కరువు పరిస్థితుల్లో గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక కొండంత అండగా నిలవనుంది.
