Rythu Bharosa : రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ‘రైతు భరోసా’ కొత్త అప్లికేషన్లు ప్రారంభం.. వెంటనే ఇలా చేయండి..
Rythu Bharosa : రైతుభరోసా పథకం కింద ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది.
- Harishth Thanniru
- Published On : March 17, 2026 / 01:49 PM IST
Telangana government is new accepting applications from farmers for the Rythu Bharosa scheme
- కొత్తగా భూమి పట్టా పొందిన రైతులకు గుడ్‌న్యూస్
- రైతు భరోసా పథకంకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం
- రైతు వేదికల్లో అప్లయ్ చేసుకోవాలన్న అధికారులు
Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. కొత్తగా రైతుల నుంచి రైతు భరోసాకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. కొత్తగా పట్టా పొందిన రైతులు (28.02.2026లోపు పట్టా పొందిన) ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.
రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా ఎకరాకు రూ.12 వేలను రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మార్చి 22 నుంచి మూడు విడతల్లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతగా ఒక ఎకరం కలిగిన రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమం ద్వారా నగదును విడుదల చేయనున్నారు. తొలి విడతలో 70లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ.3,590 కోట్లు నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు.
ఏప్రిల్ నెల రెండో వారంలో రెండో విడతలో రూ.3.65 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివరి నాటికి మూడో విడతలో రైతులకు పెట్టుబడి సాయంను ప్రభుత్వం అందించనుంది. మొత్తం మూడు విడతల్లో 1.50కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9వేల కోట్లను రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
కొత్తవారు ఇలా దరఖాస్తు చేసుకోండి..
కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వారు రైతు భరోసా పథకంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అర్హత కలిగిన అన్నదాతలు రైతు వేదికలు వద్ద లేదా.. వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి అప్లికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌లను రైతు భరోసా అప్లికేషన్ ఫారంతోపాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల్లో అందజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా భూమి పట్టాలు పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
