TG TET 2026 Exam : టెట్ రాసేందుకు సిద్ధమవుతున్నవారికి గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
TG TET 2026 Exam : ప్రతీయేటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు యేటా రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తుంది.
- Harishth Thanniru
- Published On : April 11, 2026 / 09:24 AM IST
TG TET 2026 Exam
- టెట్ రాసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త
- టెట్ నిర్వహణకు సిద్ధమైన విద్యాశాఖ
- 13న టీజీ టెట్ నోటిఫికేషన్
- జూన్ రెండో వారంలో పరీక్షలు
TG TET 2026 Exam : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్) నిర్వహణకు రెడీ అయింది. ఈ మేరకు ఈనెల 13వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించారు.
ప్రతీయేటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు యేటా రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగానే జనవరిలో పరీక్ష పూర్తికాగా.. తాజాగా రెండో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలపై చర్చించారు. ఈనెల 13వ తేదీన టీజీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒకవేళ 13వ నోటిఫికేషన్ వెలువడకుంటే ఈనెలాఖరులోగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 1.95లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో లక్ష మంది (51.37శాతం) అర్హత సాధించారు. మరోవైపు.. సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి అయింది. దీంతో జనవరిలో జరిగిన టెట్ పరీక్షకు 67,605 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరుకాగా.. వారిలో 37.893 మంది (57.76శాతం) క్వాలిఫై అయ్యారు. దీంతో మరో 30వేల మంది మాత్రమే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. వారందరికీ మరో మూడు టెట్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంది. ఈసారి టీచర్లు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే డీఎస్సీ రాసేందుకు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. బీఎడ్, డీఎడ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. టెట్‌లో ఎక్కువ స్కోర్ సాధించిన వారికి డీఎస్సీలో వెయిటేజ్ మార్కులు కలుస్తాయి. టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
