Telangana Govt : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్‌షాక్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ..

Telangana Govt : ఇందిరమ్మ ఇళ్ల శ్లాబు సైజుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శ్లాబు 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని జీవోలో పేర్కొంది.

Telangana government Key update on Indiramma Houses scheme

  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్
  • ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
  • శ్లాబు 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలి

]Telangana Govt : తెలంగాణలోని అర్హులైన ప్రతిఒక్కరికి సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో అర్హులైన పేదవర్గాల ప్రజలకు ఇండ్లను మంజూరు చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే మొదటి విడతలో ఇండ్లను పూర్తి చేసిన ప్రభుత్వం.. రెండో విడతలో లబ్ధిదారుల ఎంపికపై దృష్టిసారించింది. అయితే, ఈ పథకంకు సంబంధించి తాజాగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Telangana Rain Alert : తెలంగాణలోని ఈ జిల్లాల్లో వారంరోజులు భారీ వర్షాలు.. నేడు హైదరాబాద్‌లో కుండపోత వానలు

ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ విస్తీర్ణంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల స్లాబు 500 నుంచి 750 అడుగులకు మించరాదని గృహ నిర్మాణ శాఖ స్పష్టం చేసింది. ముందు వైపు మూడు అడుగులు, మిగతా వైపు ఒక అడుగు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గృహనిర్మాణ కార్యదర్శి విపి గౌతమ్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో శ్లాబ్ విస్తీర్ణం పెరగడం వల్ల లబ్ధిదారులకు ఖర్చు పెరుగుతోందని భావించిన అధికారులు.. ఇంటి నిర్మాణ ఖర్చులు పెరగకూడదనే ఉద్దేశంతోనే విస్తీర్ణంపై పరిమితులు విధించినట్లు పేర్కొంది.

సొంత స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడతలో భాగంగా సుమారు లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తికాగా.. మరో లక్ష ఇండ్లు ఈ సెప్టెంబర్ నెల నాటికి పూర్తవుతాయని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రెండో విడతలో ఇండ్ల కేటాయింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఖర్చు ఎక్కువ అవుతోందని, దీంతో కొందరు ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఖర్చు భారీగా పెరగడంకు గల కారణాలపై అధికారులు అధ్యయనం చేశారు.

చాలా మంది లబ్ధిదారులు శ్లాబ్ ఎక్కువ సైజులో నిర్మిస్తున్నట్లు గుర్తించారు. కొంతమంది గోడల కన్నా సుమారు 8 అడుగుల వరకు ముందుకొస్తున్నట్లు హౌసింగ్ అధికారులు తెలిపారు. పెద్ద శ్లాబు నిర్మించడం కారణంగా ఖర్చు పెరుగుతోందని, ఈ కారణంగానే కొంతమంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంను మధ్యలోనే నిలిపివేస్తున్నారని అధికారులు గుర్తించారు. దానివల్ల పేదలు ఇళ్లు నిర్మాణంకోసం సబ్సిడీ నిధులు ఇచ్చే ప్రధాన లక్ష్యమే దెబ్బతింటోందని ప్రభుత్వం పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు విధించాలని హౌసింగ్ కార్పొరేషన్ కోరడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటి ముందు వైపు గోడల కన్నా మూడు అడుగులు, మిగతా వైపు ఒక అడుగు మాత్రమే స్లాబ్ ఉండాలని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. 400 చదరపు అడుగుల ఇంటికి 500 అడుగుల వరకు, 600 ఎస్ఎఫ్‌టీ ఇంటికి 750 అడుగుల వరకు మాత్రమే శ్లాబు ఉండాలని ప్రభుత్వం పరిమితి విధించింది.